Chandrababu: విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన అభివృద్ధి దృక్పథాన్ని స్పష్టం చేశాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఆయన, భారత్ 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో స్థానానికి చేరుకోవడం గొప్ప విజయమని గుర్తు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వల్లే ఈ మార్పులు సాధ్యమయ్యాయని, ఒకప్పుడు కేవలం జాబ్ వర్క్‌కి పరిమితమైన ఐటీ రంగం నేడు ప్రపంచస్థాయి అద్భుతాలను సృష్టిస్తోందని అన్నారు.
ప్రపంచంలో భారతీయులు తలసరి ఆదాయంలో ముందుండడం మన గర్వకారణమని తెలిపారు. 2047 నాటికి భారత్ మొదటి స్థానంలో నిలుస్తుందనే నమ్మకం తనకుందని స్పష్టం చేశారు. అలాగే, ఇంగ్లాండ్ పర్యటనలో మ్యూజియంలోకి కోహినూరు వివాదం కారణంగా తాను వెళ్లనివ్వలేదని గుర్తు చేస్తూ, బ్రిటీష్ వారు చాలాను కొల్లగొట్టినా కనీసం ఆంగ్ల భాషను వదిలిపెట్టారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: తెలంగాణ సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం..
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి 1,000 కిలోమీటర్ల తీరరేఖ ప్రధాన చోదకశక్తిగా మారుతుందని, ఆగస్టు నాటికి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని తెలిపారు. గణితం, ఆంగ్ల భాషలో ఉన్న ప్రతిభ కారణంగానే భారత ఐటీ రంగం బలపడుతోందని అన్నారు. వ్యాపార ఆలోచనలతో ముందుకు రావాలని, ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఇవ్వగలిగేవారిగా యువత తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలు, అన్నింటికీ మించి మంచి మనసున్న మనుషులు ఉండటం ఈ నగర ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.
“వికసిత్ భారత్” లక్ష్యం
స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంకల్పాలను గుర్తు చేశారు. మోదీ పాలనలో భారత్ 11వ స్థానంలో నుంచి నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2047 నాటికి నెంబర్ వన్ స్థానంలోకి చేరుతుందని స్పష్టం చేశారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో మహిళలే అసలు ఫైనాన్స్ మినిస్టర్లని ఆయన అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిందేనని పిలుపునిచ్చారు.
ఆరోగ్య సంకల్పం
ఆరోగ్య సమస్యలు కుటుంబాలపై భారంగా మారుతున్నాయని, అందుకే ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ పాలసీ అందించాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. మహిళలు ప్రతి రోజు అరగంట సమయం తమ ఆరోగ్యానికి కేటాయించాలని సూచించారు. ఆయిల్, షుగర్, ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. ఆరోగ్య రంగంలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే యోచనలో ఉన్నామని వెల్లడించారు.
హాస్పిటల్ ఖర్చులు ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా ఉన్నాయని, అందుకే బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో “సంజీవని” కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. విశాఖ దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు పొందడం గర్వకారణమని, ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు.