CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన వచ్చే నెల (నవంబర్) 2వ తేదీన లండన్ వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆయన లండన్‌లో పర్యటించనున్నారు.
విశాఖ సమ్మిట్‌కు ఆహ్వానం
రాబోయే సీఐఐ సమ్మిట్ (CII Summit) నేపథ్యంలో సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆధ్వర్యంలో వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా విదేశీ పారిశ్రామిక వేత్తలను వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి ఆయన లండన్ వెళ్తున్నారు.
Also Read: MLC Nagababu: శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు
లండన్‌లో ఉన్న పారిశ్రామిక వేత్తలను, కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారికి వివరించనున్నారు. ఈ సీఐఐ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే, సమ్మిట్‌కు ముందుగానే విదేశాల్లో పర్యటించి పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం నిర్ణయించారు.
ఈ పర్యటన తేదీలను అధికారులు ధృవీకరించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం శ్రీశైలంలో పర్యటిస్తున్న సమయంలోనే సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీశైలంలో మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.