CM Chandrababu: అమరావతి ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగిన ఖాదీ సంతలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫోటో ప్రదర్శనను తిలకించిన అనంతరం క్రీడాకారిణి పీవీ సింధుకు అగ్గిపెట్టలో చీరను బహూకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అన్నారు..“ఖాదీ అంటే గాంధీ, గాంధీ అంటే స్వాతంత్రోద్యమ స్ఫూర్తి. ఖాదీ సంత అనేది కేవలం మార్కెట్ మాత్రమే కాదు, ఇది మన మూలాలు, మన ఆత్మ గౌరవానికి ప్రతీక. వారానికి ఒక రోజు ఈ సంతలోకి వెళ్లి కొనుగోలు చేస్తే, అది గ్లోబల్ మార్కెట్ స్థాయికి చేరడం ఖాయం” అని గుర్తు చేశారు.
స్వదేశీ విలువలు – ఆధునిక అభివృద్ధి
విదేశీ వస్త్రాలను తగులబెట్టిన కాలం నుంచి భారతదేశం ఎన్నో సంస్కరణలు చూసిందని ఆయన పేర్కొన్నారు. 60% విదేశీ మార్కెట్ మన దేశంలో జరుగుతోందని తెలిపారు. ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన పీవీ నరసింహారావు, వాటిని బలోపేతం చేసిన వాజ్పేయి కృషిని గుర్తు చేశారు. “ఈరోజు అమెరికా కంటే మెరుగైన రహదారులు భారతదేశంలో ఉండటానికి కారణం వాజ్పేయి” అన్నారు.
సాంకేతికతపై హాస్యోక్తి
“ఒకప్పుడు ఎమ్మెల్యేలకు ఒక జీప్, మూడు టెలిఫోన్లు ఇస్తే గొప్ప అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు సెల్ఫోన్ లేకుండా ఒక్కరు కూడా ఉండలేరు. భార్య లేక భర్త ఉంటారు, భర్త లేక భార్య ఉంటారు కానీ సెల్ఫోన్ లేక ఎవరూ ఉండలేరు” అంటూ సభలో హాస్యోక్తి విసిరారు.
మోడీ కృషిని ప్రస్తావన
ప్రధాని మోడీ కృషిని గుర్తుచేసిన చంద్రబాబు.. “వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రాణాలు కాపాడిన నాయకుడు మోడీ” అని ప్రశంసించారు.“మూలాలు మర్చిపోరు, భవిష్యత్తు వదిలిపెట్టరు, స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటారు” అని అన్నారు.స్పేస్ సిటీ ద్వారా ప్రైవేట్ సెక్టార్లో శాటిలైట్లు తయారు చేసి రాబోయే రోజుల్లో అన్ని దేశాలకు అందిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: India-EFTA: అమల్లోకి భారత్-ఈఎఫ్టీఏ ఒప్పందం
ఖాదీ సంత – ఆత్మనిర్భరతకు చిహ్నం
ఈ సందర్భంగా సీఎం అన్నారు
రాష్ట్రంలో తయారైన అన్ని వస్తువులు ఖాదీ సంతలో ప్రదర్శిస్తున్నామన్నారు.ప్రపంచాన్ని యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.“160 కోట్లకు జనాభా పెరుగుతుంది. ఈ జనాభా మన బలమైన ఆస్తి. మన భారతీయులు ఎవరికీ తగ్గేవారు కారని నిరూపిస్తారు” అన్నారు.
కళలు, ఉత్పత్తులకు ప్రోత్సాహం
కళలను, స్థానిక ఉత్పత్తులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ప్రధానికి అరకు కాఫీ ఇచ్చినప్పుడు ఆయన అన్ని చోట్లా దాన్ని ప్రస్తావించారని ఉదాహరణగా చెప్పారు.“వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.జీఎస్టీ సరళీకరణ, సంస్కరణలు అన్నీ సామాన్యుడి స్థాయికి చేరేలా చేస్తామని చెప్పారు.
“సంకల్పం చేస్తే సాధించే రోజు తప్పకుండా వస్తుంది. ఖాదీ సంత కేవలం ఒక ఉత్సవం కాదు, ఇది గాంధీ ఆశయాలు, స్వదేశీ స్ఫూర్తి, మన ఆత్మ గౌరవానికి ప్రతీక” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.