Cm chandrababu: తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటీవల ఇద్దరు కీలక నేతల మధ్య చెలరేగిన వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం సోషల్ మీడియా దాకా వెళ్లి, పరస్పర విమర్శలు తీవ్ర స్థాయికి చేరడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలను పిలిపించి సర్దిచెప్పాలన్న పల్లా ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించినట్టు సమాచారం. “నేనే యూఏఈ నుంచి వచ్చాక ఈ అంశాన్ని స్వయంగా చూసుకుంటా” అని చంద్రబాబు స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీలో కొందరు నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం తగదని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ రేఖ దాటిన వారెవరైనా ఉపేక్షించబోమని హెచ్చరించినట్టు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని బహిరంగంగా కాకుండా, అంతర్గత వేదికలపైనే చర్చించాలని ఆయన సూచించారు.
ఈ వివాదం తిరువూరు నియోజకవర్గంలోని స్థానిక అంశాలపై ప్రారంభమైంది. ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారని కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక, చిన్ని అనుచరులకు డబ్బు ఇచ్చినట్టు చెబుతూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తన వాట్సాప్ స్టేటస్‌లో ఉంచి కలకలం రేపారు. ఎంపీ కేశినేని చిన్ని ఘాటుగా స్పందిస్తూ, “నిన్నటివరకు నన్ను దేవుడిలా పొగిడిన కొలికపూడికి ఇప్పుడు నేను దెయ్యంలా కనిపిస్తున్నానా?” అని విమర్శించారు.
ఈ సంఘటన పార్టీ లోపల చర్చనీయాంశంగా మారగా, చంద్రబాబు తిరిగి దేశానికి రాగానే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.