Cm chandrababu: నేడు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన లఘు చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి, ప్రజెంటేషన్ అందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు, ఇటీవల వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం అంశంపై తమ స్పష్టమైన వైఖరి వెల్లడించారు. త్రిభాషా విధానంలో ఎలాంటి తప్పు లేదని, భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనమేనని, భావవ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనం మాత్రమేనని అన్నారు.
“ఇంగ్లీష్ మీడియంతో నాలెడ్జ్ వస్తుందని కొందరు అంటున్నారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా రాణించిన వారు తమ మాతృభాషలోనే చదువుకున్నవారే. భాష ఏదైనా సరే, దాన్ని ద్వేషించడంలో అర్థం లేదు.
మన విషయానికొస్తే, మన మాతృభాష తెలుగు, మనకు హిందీ జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. మన ప్రజలు జపాన్, జర్మనీ, ఇతర దేశాలకు వెళుతున్నారు. అవసరమైతే అక్కడి భాషలను కూడా నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయి. ఎన్ని భాషలు నేర్చుకుంటే, అంత ఎక్కువ ఉపయోగం ఉంటుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, తమిళనాడు వంటి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.