Anantapur: ఆర్‌ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృత్యువాతపడింది. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి, లక్ష్మీ దంపతుల కుమారై అనుశ్రీ రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది.
రాయదుర్గంలోని మూసక్లినిక్‌లో ఆర్‌ఎంపీ డాక్టర్‌కు చూపించారు..అయినా జ్వరం తగ్గకపోవడంతో మరోసారి క్లినిక్‌కు తీసుకొచ్చారు. ఆర్‌ఎంపీ హఫీజ్ రక్త పరీక్షలు చేయించి.. టైఫాయిడ్ ఉన్నట్లు నిర్ధారించాడు.. అనంతరం అక్కడే సైలెన్ బాటిల్ ఎక్కించారు. అయితే కొద్దిసేపటికే చిన్నారిలో తేడా కనిపించడంతో ఆందోళనకు గురైన ఆర్‌ఎంపీ.. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు..
కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అనుశ్రీ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో బంధువులు మృతదేహాన్ని తీసుకుని క్లినిక్ వద్దకు వచ్చి ఆర్‌ఎంపీని నిలదీసి ఆందోళనకు దిగారు.. విషయం తెలుసుకున్న సీపీఎం, విద్యార్థి సంఘాలు, MRPS నాయకులు అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి, ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ జయనాయక్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు.