వైసీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ex minister alla khali krishna srinivas) పై చీటింగ్ కేసు నమోదైంది. కోర్టుఆదేశాలతో ఆళ్ల నానితో పాటు మరో ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎందుకంటే..
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏలూరు నియోజకవర్గం పరిధిలో ఆళ్ల శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. శాంతినగర్‌లో లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో వైఎస్ఆర్సీపీ నాయకుడు దిరిశాల వరప్రసాద్, వాలంటీర్ అవుటుపల్లి నాగమణి ఇతరులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అపార్టుమెంట్ 4వ అంతస్తులో ప్రచారం ముగించుకొని వారంతా కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కారు.
ఆ సమయంలో లిఫ్ట్ ఫెయిల్ అయ్యి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నాగమణి తీవ్రంగా గాయపడ్డారు నాగమణిని చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తారలించారు. బాధితురాలు వైద్యానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పట్లో మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. వైసీపీ(ycp) ప్రభుత్వం కోల్పోయాక నాని తనను కనీసం పట్టించుకోలేదని, నష్టపరిహారం కూడా రాలేదని బాధితురాలు వైసీపీ నాయకులను నిలదీసింది.
దీంతో వైసీపీ నాయకులు తనను బెదిరించారని బాదితురాలు వాపోయింది. తనను ఆదుకోకపోగా.. బెదిరింపులకు దిగడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ప్రకారం సెప్టెంబర్ 29 2024 రాత్రి ఆళ్ల నాని, దిరిశాల వరప్రసాద్, సుధీరా బాబు, జీలూ, కురెళ్ల రాంప్రసాద్‌తో పాటు వైద్యులు సునీల్ సందీప్, లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ ప్రెసిడెంట్, సెక్రటరీ తదితరులపై కేసు నమోదు చేశారు.

