CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి, కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ప్రజలు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కుప్పం సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు:
తుమ్మిశిలో జరిగిన ‘ప్రజావేదిక’ సభలో మాట్లాడిన చంద్రబాబు, కుప్పం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. ఈ నియోజకవర్గాన్ని రాయలసీమలో ఒక ముఖ్యమైన ఉద్యానవన కేంద్రంగా (హార్టికల్చర్ హబ్) అభివృద్ధి చేస్తామని చెప్పారు. రూ.1292.74 కోట్లతో వివిధ పనులు చేపట్టామని, అలాగే రూ.3829 కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కుప్పం చివరి ఆయకట్టుకు నీరందిస్తామని వివరించారు.
ప్రధాన హామీలు, పథకాలు:
సౌర విద్యుత్: రైతుల పంపుసెట్లకు ఉచితంగా సౌర విద్యుత్, పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి రూ.98 వేల రాయితీ. రూ.564 కోట్లతో వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్ అందేలా కార్యాచరణ.
రోడ్లు, మౌలిక వసతులు: రూ.42.5 కోట్లతో 46 కి.మీ సీసీ రోడ్లు, 65 కి.మీ బీటీ రోడ్లు పూర్తి. తాగునీటి సరఫరాకు రూ.8.97 కోట్లు, గోకులం షెడ్లకు రూ.7.63 కోట్లు, వీధి దీపాలకు రూ.3.7 కోట్లు, పాఠశాల ప్రహరీల నిర్మాణానికి రూ.1.64 కోట్లు కేటాయింపు.
పరిశ్రమలు, ఉపాధి: కుప్పం ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని, రూ.1617 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. కుప్పం-హోసూరుకు సమాంతరంగా మరో రోడ్డు నిర్మాణంతో పాటు, కుప్పం ప్రాంతానికి విమానాశ్రయం వస్తుందని ప్రకటించారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Siddharth Kaushal: IPS అధికారి సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
సంక్షేమం: కొత్తగా మంజూరైన 3041 పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. వెయ్యి మంది దీపం పథకం లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. గతంలో దీపం పథకంతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఇప్పుడు దీపం 2.0 తో ఉచిత సిలిండర్లు అందిస్తున్నామని గుర్తుచేశారు.
పరిశుభ్రత, ఆరోగ్యం: చెత్త సేకరణకు 130 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు. చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ ఆటోలు వాడే తొలి నియోజకవర్గంగా కుప్పం నిలవనుంది. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లను (పేటీఎం సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు) ప్రారంభించారు. 400 అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘కేర్ అండ్ గ్రో’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వ్యవస్థలు నాశనమయ్యాయని చంద్రబాబు విమర్శించారు. ఏడాది కాలంలో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని, కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కుప్పం కృష్ణగిరి, కేజీఎఫ్, బెంగళూరు, చెన్నై, చిత్తూరులకు కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్పంలో లీ కంఫర్ట్ 3 స్టార్ రిసార్టును కూడా ప్రారంభించారు.