Chandrababu: ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యం అని స్పష్టంగా తెలిపారు. గతంలో అమల్లో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బదులుగా ఇప్పుడు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అనుసరిస్తూ పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరగబోయే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశ పారిశ్రామిక వేత్తలు, రాయబారులను ఆయన ఆహ్వానించారు.
ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ 2047’ దిశగా, రాష్ట్రానికి ప్రత్యేకంగా ‘స్వర్ణాంధ్ర 2047 విజన్’ రూపొందించామని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఇందుకోసం లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రొడక్ట్ పర్ఫెక్షన్ వంటి అంశాలను కలుపుకుని పది సూత్రాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
టెక్నాలజీ రంగంలో ముందడుగు వేస్తూ 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పనిచేయనుందని చంద్రబాబు వెల్లడించారు. ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం పరికరాల ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్ సిటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోందని, ఇది అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.
పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చెప్పారు. దేశంలో లక్ష్యంగా పెట్టుకున్న 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో, ఏపీ 160 గిగావాట్ల ఉత్పత్తి చేయాలని నిర్ణయించిందని తెలిపారు. సోలార్, పవన విద్యుత్, పంప్డ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపీలో అమలు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏపీని దేశ పునరుత్పాదక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
తీరప్రాంతంలో ప్రపంచ ప్రమాణాలతో పోర్టులు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్లను నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అడ్వాన్స్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తూ రైతులకు లాభం చేకూర్చే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బిగ్ టెక్ కంపెనీలకు ఏపీని కీలక కేంద్రంగా మార్చుతున్నామని ఆయన వివరించారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో భారత్ గ్లోబల్ టెక్ పవర్ హౌస్‌గా ఎదుగుతుందని పేర్కొన్నారు.
అమరావతిని గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసినట్లు సీఎం తెలిపారు. నీటి వనరుల సమర్థ వినియోగం, సుస్థిర పాలన, సుస్థిర విధానాలతో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏపీలో ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీకే ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉందని, ఒకసారి రాష్ట్రాన్ని సందర్శిస్తే పరిశ్రమల వేత్తలు పెట్టుబడులు పెట్టాలని నమ్మకంగా ముందుకు వస్తారని ఆయన అన్నారు.