Shwetha Menon: మలయాళ నటి శ్వేతా మీనన్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అశ్లీల వీడియోలను పంపిణీ చేసి డబ్బు సంపాదించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎర్నాకుళం కోర్టు ఆదేశాల మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదుకు కారణం ఏమిటి?
ప్రజా కార్యకర్త మార్టిన్ మెనాచేరి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67(A) తో పాటు, అశ్లీలత నిరోధక చట్టం కింద కూడా శ్వేతా మీనన్‌పై కేసు పెట్టారు. ఫిర్యాదుదారు వాదన ప్రకారం, శ్వేత కొన్ని సినిమాల్లో నగ్న సన్నివేశాల్లో నటించడం, కండోమ్ ప్రకటనల్లో బోల్డ్ పాత్రలు పోషించడం ద్వారా డబ్బు కోసం అశ్లీలతను ప్రోత్సహించారని ఆరోపించారు.
శ్వేతా మీనన్ సినీ ప్రస్థానం
శ్వేతా మీనన్ ‘రతినిర్వేదం’, ‘పలేరి మాణిక్యం’, ‘కలిమన్ను’ వంటి బోల్డ్ సినిమాలతో పాటు, ‘సాల్ట్ అండ్ పెప్పర్’ వంటి సాఫ్ట్ కామెడీ చిత్రాలలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2018లో బిగ్‌బాస్ మలయాళంలో పాల్గొన్న ఆమె, ప్రస్తుతం మలయాళ మూవీ ఆర్టిస్టుల సంఘం (AMMA) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ కేసు రావడం ఆమె రాజకీయ, సినీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.