Bandi sanjay: బనకచర్ల ప్రాజెక్టు అంశంలో తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమాఖ్య స్ఫూర్తితో, సమ న్యాయంతో అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయడం కేంద్ర బీజేపీ ప్రభుత్వ ధోరణి అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుపై త్వరలో జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని ఆయన సూచించారు. బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం, మీడియా ముందే విమర్శలు చేయడం మానుకోవాలని విమర్శకులపై మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు (1980) మరియు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)ను ఉల్లంఘించే అవకాశముందన్న ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమన్వయంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఎలాంటి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తమపై ఉందని, తెలంగాణ హక్కులను కాపాడేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని బండి సంజయ్ హామీ ఇచ్చారు.