Balram: ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో 91 శాతం ఉత్పత్తి లక్ష్యాలు, 93 శాతం రవాణా లక్ష్యాలు మాత్రమే సాధించామని, మిగిలిన కాలంలో ఉత్పత్తిపై మరింత దృష్టి పెట్టాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. బుధవారం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలతో సమావేశం నిర్వహించారు.
వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఉత్పత్తి లక్ష్యాలను పెంచినట్లు ఆయన వెల్లడించారు. రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలని, అలాగే రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాల్సిన అవసరం ఉందని ఆదేశించారు.
గత రెండు నెలల్లో సింగరేణి మనుగడకు, భవిష్యత్తుకు దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని బలరామ్ గుర్తు చేశారు. క్రిటికల్ మినరల్స్ అన్వేషణలో అడుగు పెట్టడంతో పాటు, బొగ్గు బ్లాకులు మరియు ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపారు. అంతేకాకుండా సింగరేణి అంతర్జాతీయ కార్యాలయం నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
సంస్థ బహుముఖ విస్తరణ దిశగా పయనిస్తున్నందున ఉద్యోగులందరికీ ఆర్థిక స్థితిగతులు, విస్తరణ ప్రణాళికలపై అవగాహన ఉండాలని సూచించారు. ప్రతి ఉద్యోగి ప్రతీ షిఫ్ట్‌లో 8 గంటలు పూర్తి స్థాయిలో పనిచేయడం అత్యవసరమని, పని సంస్కృతి మెరుగుపడితేనే సింగరేణి అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకుంటుందని అన్నారు
రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని సీఎండీ స్పష్టం చేశారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచితేనే బొగ్గు రంగంలో మనుగడ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఏరియాల వారీగా అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, హైదరాబాద్ నుంచి ఈడీ (కోల్ మూవ్మెంట్) బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.