Balakrishna: సినీ రంగంలో తన ప్రతిభతో విశేష విజయాలను సాధిస్తూ, రాజకీయ రంగంలోనూ, సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ఘనత ఆయనను వరించడంతో బాలకృష్ణ ఆనందంతో స్పందించారు.
తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని బాలకృష్ణ తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే తమకు అభినందనలు తెలిపిన అభిమానులు, సన్నిహితులు, సహచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తన విజయప్రయాణంలో భాగస్వామ్యులైన నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు, కుటుంబ సభ్యులు, అలాగే యావత్ సినీ రంగానికి తాను రుణపడి ఉంటానని చెప్పారు. ముఖ్యంగా, తన ప్రతి విజయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అభిమానులపట్ల బాలకృష్ణ తన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
“నా కోసం నిలబడి, నాకు మద్దతు అందించిన అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రేమ, ఆదరాభిమానాలకోసం నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణ తనతో పాటు పద్మ అవార్డు పొందిన ప్రతి వ్యక్తిని అభినందిస్తూ, వారి విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.