Seethakka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీలో వర్గ పోరు ముదురుతోందట. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలోనే నేతలు ఒక్కరిపై ఒక్కరూ పరస్పరం వాదనలకు దిగారట. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం, గ్రూపులుగా మారడానికి కొందరు నేతలే కారణమని ఫిర్యాదులు సైతం చేసుకున్నారట. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మంత్రి సీతక్క చేసిన ఆ కామెంట్స్ ఏంటి? హస్తం పార్టీలో అలజడికి కారణాలేంటి? వాచ్ దిస్ స్టోరీ..
మొన్న గాంధీ భవన్‌లో జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పనితీరు ఏ మాత్రం బాగోలేదని ఆమె బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి వివరించి బాధ్యతల నుంచి వైదొలుగుతానని మంత్రి సీతక్క వెల్లడించడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పదవీ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానన్నారు సీతక్క.
తాను వ్యక్తిగత ఇంట్రస్ట్‌తో ఆదిలాబాద్ ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్నానని… కానీ, కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనీ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారట. పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేస్తూ మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారని ఆవేదన చెందారట. జిల్లాకు సంబంధం లేని వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తూ… తనని పని చేయనివ్వడం లేదని మంత్రి సీతక్క వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీలో పాత నేతలకు ప్రాధాన్యత లేదని, పలువురు నేతలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారట. ఒక్కరిద్దరు వ్యక్తుల ప్రవర్తన వల్ల ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. కొందరు నాయకుల వల్లనే ఆదిలాబాద్ లోకసభ సీటు కోల్పోవడమే కాకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పరాజయానికి దారితీసిందని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారట పలువురు నేతలు.
ఇది కూడా చదవండి: Gaddar Awards: గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
ఇతర జిల్లాకు చెందిన ఓ నేత ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో పెత్తనం చేలాయించడమే కాకుండా, అధికారుల బదిలీల్లో సైతం కీరోల్ పోషిస్తున్నారని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తెచ్చారట పలువురు కాంగ్రెస్ నేతలు. దాంతో పాటు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జిల్లాకు సంబంధం లేని నాయకుడు ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ని విభజిస్తున్నారాని, ఇంచార్జ్ మంత్రిని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారట. పార్టీ ఎందుకు మారామా? అని ఇప్పుడు బాధగా ఉందని ఓ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు సమాచారం. కార్యక్రమాలకు సంబంధించి ఎవరూ సమాచారం ఇవ్వడంలేదని, సమన్వయ లోపం ఎక్కువగా ఉందని మరి కొంతమంది చెప్పుకొచ్చారట. అంతా శ్రద్ధగా విన్న మీనాక్షి నటరాజన్.. గ్రూప్స్ వద్దనీ, కో ఆర్డినేషన్ కోసం ఓ కమిటీ వేస్తామపీ, పార్టీ అంతర్గత విషయాలు బయటకు వెళ్లనీయొద్దని హెచ్చరించినట్టు సమాచారం.
మొత్తానికి ఆ నేత వ్యవహార శైలిపై జిల్లా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో పెద్దనేతల అండ ఉందని ఇన్నాళ్లూ ఎవరూ ప్రశ్నించలేకపోయారని, ఇప్పుడు స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జోక్యం చేసుకునేసరికి అంతా ఓపెన్ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.