Vamsi Mind Game: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్ రూపంలో తాత్కాలిక ఉపశమనం లభించినా.. ఇప్పుడిప్పుడే జైలు కష్టాల నుండి బయటపడే యోగం లేనట్లే కనిపిస్తోంది. గతంలో చేసిన తప్పిదాలు సరిపోవన్నట్లుగా… కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసి, ఏదేదో చేయాలని భావించారు. దాంతో కిడ్నాప్ కేసులో వల్లభనేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీ పోలీసులు అతని కేసుల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వరుసుగా విచారణ మొదలుపెట్టారు. వల్లభనేని వంశీపై ఇప్పటి వరకు దాదాపు 9 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అరెస్టైన కొన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. వరుస కేసులు, పీటీ వారెంట్ల దెబ్బకు బెయిల్ వచ్చినా, జైలు తప్పడం లేదు. దీంతో వల్లభనేని 100 రోజులుగా జైలు గోడల మధ్యే కాలం వెల్లదీశారు.
2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరపున గెలిచి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీలో చేరారు వల్లభనేని. ఆ తర్వాత అధికార వైసీపీ అండతో తాను విడిచిపెట్టిన టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆపార్టీ అధినాయకత్వంపై చౌకబారు వ్యాఖ్యలు, ఆరోపణలు చేసి.. సొంత సామాజికవర్గానికే దూరమయ్యారు వల్లభనేని వంశీ. 2024 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసిన వంశీ ఓటమి పాలయ్యారు. గతంలో అధికారం చేతిలో ఉందనే అహంకారంతో అడ్డగోలుగా వ్యవహరించిన వల్లభనేని వంశీ.. ఇప్పుడు వాటికి మూల్యం చెల్లించుకుంటున్నారు. అవినీతి, అక్రమాలతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై నోటికొచ్చినట్లు దూషించి, ప్రజల చేతే ఛీకొట్టించుకున్నారు. 2019 ఎన్నికల సమయంలోనే గన్నవరంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీపై కేసు నమోదైంది.
అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు కోర్టుకు నివేదించినప్పటికీ, ఆ కేసును మాత్రం మూసివేయలేదు. కూటమి అధికారంలోకి రావడం… యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పరిస్థితులు మారాయి. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో వంశీ పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించి ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఇక మరోవైపు గన్నవరం నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్‌పై గనుల శాఖ ఏడీ, వల్లభనేని వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం 58 పేజీలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వంశీ, ఆయన అనచరుల అక్రమ మైనింగ్‌పై పూర్తి ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 100 కోట్ల విలువైన సహజ వనరులను కొల్లగొట్టారని మైనింగ్ శాఖ ఏడీ ఫిర్యాదులో పేర్కొన్నారు. మైనింగ్ ఏడీ ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ఫైల్ నెంబర్ 142/2025తో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.
Also Read: Gudivada Amarnath: గుడివాడ అమర్నాథ్ వైసీపీని వీడతారా?
Vamsi Mind Game: ఇలా వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వల్లభనేని వంశీకి ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. వంద రోజులకు పైగా జైల్లో ఉన్న కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని, చికిత్స చేయించుకునేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ. తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని, తక్షణమే చికిత్స తీసుకుంటే తప్పించి తాను కోలుకోలేనని.. ఈ కారణంగా వైద్యం చేయించుకునేందుకు తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. వైద్య చికిత్సల నిమిత్తం వంశీకి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. వంశీ కోరుకున్నట్లుగానే విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని పోలీసులను ఆదేశించింది. అయితే వల్లభనేని వంశీ తనకు ఆరోగ్యం బాగోలేదని పదే పదే చెబుతూ వచ్చారు. దీంతో ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించారు. అంతా బాగుందని రిపోర్టులు రావడంతో మళ్లీ జైలుకు తరలించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ప్రభుత్వ డాక్టర్లపై దారుణమైన భాషతో విరుచుకుపడుతున్నారు. ఎట్టకేలకు వంశీ తాను కోరుకున్నట్లుగానే జైలు నుండి ప్రయివేటు ఆస్పత్రికి షిఫ్ట్ అయ్యారు.
టీడీపీ వర్గాలు మాత్రం వంశీ అనారోగ్యం వార్తల్ని కొట్టిపారేస్తున్నారు. వంశీ మైండ్ గేమ్‌తో సింపతీ కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హాస్పటల్‌కు తీసుకొచ్చినప్పుడు, స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు మాత్రమే వంశీ ఆ విధంగా కనిపిస్తున్నారనీ, మీడియా ఫోకస్ లేని సమయంలో అతను మామూలుగానే ఉంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనేక సందర్బాల్లో వల్లభనేనికి హాస్పటల్‌లో చెకప్‌లు చేయించారు. ఎప్పుడూ వైద్యులు మాత్రం అతని ఆరోగ్యంపై ఏమాత్రం ఆందోళన వ్యక్తం చేయలేదు. సహజంగా జైలులో ఉన్నప్పుడు అక్కడ వాతావరణ పరిస్ధితులు, ఆహారం వల్ల కొద్దిపాటి నీరసం రావడం సహజమేనని, కానీ వంశీది మాత్రం పూర్తిగా ప్రజల సింపతి కొట్టేసేందుకు ఆడుతున్న మైండ్ గేమ్ అని మరికొందరు చెబుతున్నారు.