Gudivada Amarnath: గుడివాడ అమర్నాథ్ వైసీపీలో ఫైర్ ఉన్న నేత. తండ్రి వారసత్వ రాజకీయాన్ని అందిపుచ్చుకొని 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే ఛాన్స్ రావడంతో అటు యూత్‌లోను, ఇటు తన సామాజికవర్గంలోనూ పాపులర్ అయ్యారు. అంతేకాక జగన్‌కు అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన ఈ మాజీ మంత్రి జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు శాఖలను సమర్థంగా నిర్వహించారని ఆయన అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు చాలా గట్టిగానే బదులిచ్చేవారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు పరిస్థితులు మారాయంట. ప్రస్తుతానికి గుడివాడ అమర్నాథ్ పార్టీ అధినాయకుడిపై అలకబూనారన్న వార్త విశాఖ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత విశాఖలో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. ముఖ్యంగా గాజువాకలో పోటీ చేసిన గుడివాడ అమర్.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌పై అత్యంత భారీ తేడాతో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో అదే అత్యంత చెత్త ఓటమిగా రికార్డైంది. అయినప్పటికీ జగన్‌తో ఉన్న సానిహిత్యంతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ నాయకులందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న మాజీ మంత్రికి వైసీపీ ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండి విశాఖ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి, అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమించింది. అంతేకాక మొన్న పోటీ చేసిన గాజువాక సమన్వయకర్తగా కూడా తప్పించి, అనకాపల్లి జిల్లాలోని చోడవరం ఇంచార్జిగా నియమించింది. ఈ చర్యతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారంట ఈ మాజీ మంత్రి.
Also Read: Nara Lokesh: సైకో పార్టీ అని నిరూపిస్తున్నారు.. వైసీపీ కార్యకర్తలపై లోకేష్ ఆగ్రహం
Gudivada Amarnath: గుడివాడ అమర్నాథ్ పక్కా లోకల్. విశాఖ వేదికగా రాజకీయాలు చేయాలని ఆశ పడ్డారు. అందుకే అనకాపల్లి సీటు వదులుకొని గాజువాకలో పోటీ చేశారంటారు ఆయన అభిమానులు. ఓటమి తర్వాత సంవత్సర కాలంగా విశాఖ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవాలని కష్టపడుతుంటే.. విశాఖ జిల్లా నుంచి పూర్తిగా తనను పంపించేసారని లోలోపల మదన పడుతున్నారంట గుడివాడ. గత నెలలో జరిగిన జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం ఎన్నికల్లో కూడా అమర్నాథ్ చక్రం తిప్పారు. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ కార్పొరేటర్లను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు పంపించడంలో కీలక పాత్ర పోషించారు. అయినా స్థానికుడైన తనను కాదని ఇతర జిల్లాల నాయకులకు రీజనల్ కోఆర్డినేటర్, విశాఖ పార్లమెంట్ పరిశీలకులు, విశాఖ అధ్యక్ష పదవులు కట్టబెట్టడం గుడివాడ అమర్నాథ్‌కు నచ్చలేదట. అందుకే ఆయన జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
మరోవైపు ఈ ప్రచారంపై అమర్నాథ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమర్నాథ్ ఫ్యామిలీ ఫంక్షన్ నిమిత్తం విదేశాలకు వెళ్లారని, సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు. అంతేతప్ప వ్యక్తిగత పర్యటనని రాజకీయం చేయడం సరికాదని, వచ్చే నెలలో ఆయన తిరిగి వచ్చి, మళ్లీ యాక్టివ్ అవుతారని బదులిస్తున్నారు. అంతేకాక, ఈ ప్రచారానికి పులిస్టాప్ పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఈ మాజీ మంత్రి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. బయట ప్రచారం జరుగుతున్నట్టు వైసీపీకి బిగ్ షాక్ ఇస్తారా? లేక మళ్లీ పార్టీలో యాక్టివేట్ అయ్యి తన పని తాను చూసుకుంటారా అన్నది ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో, ముఖ్యంగా వైసీపీలో పెద్ద చర్చ నడుస్తోంది.