TTD Goshala Issue : తిరుమల పవిత్ర క్షేత్రంపై కట్టు కథలతో మరోసారి యుద్ధం ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో వందల ఆవులు చనిపోయాయంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపింది. టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో 100కు పైగా గోవులు మరణించాయని, టీటీడీ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అసంబద్ధ ఫోటోలతో ఈ డ్రామాను రక్తికట్టించిన వైసీపీ, భక్తుల మనోభావాలను కాలరాసేందుకు ఎంతకైనా దిగజారుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ వెంటనే ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ విష్పష్టంగా వివరణ ఇచ్చింది. గోశాలలో ఎలాంటి అసహజ మరణాలూ లేవని, ప్రస్తుతం ఉన్న 1,768 గోవులు ఆరోగ్యంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.. తిరుమల గోశాలకు సంబంధం లేనివని, ఇది దురుద్దేశపూరిత కుట్ర అని టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణకు ఆదేశించింది. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
గోశాలలో గోవులకు సరైన ఆహారం, వైద్య సౌకర్యాలు అందుతున్నాయని… అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్ల మాత్రమే కొన్ని మరణాలు జరుగుతాయని వివరించారు. మంత్రి నారా లోకేష్ ఈ దుష్ప్రచారాన్ని నీచ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తిరుపతి తొక్కిసలాట కేసులో నిందితుడైన గోశాల మాజీ అధికారిని కాపాడేందుకే వైసీపీ ఈ ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.
Also Read: Harsha Investigation Fail: ‘ఆధారాలు’ ఇచ్చే వరకూ వదిలేది లేదు!
TTD Goshala Issue: లడ్డూ కల్తీ వివాదంలో వైసీపీ బురదజల్లే ప్రయత్నాలు విఫలమైనట్టే, ఈ గోశాల డ్రామా కూడా బెడిసికొట్టింది అంటున్నారు విశ్లేషకులు. గతంలో చంద్రబాబుపై పింక్ డైమండ్ ఆరోపణలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కార్, ఆధారాలు లేక ఉడిగిపోయిన చరిత్ర మరోసారి గుర్తుకుతెస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలను వాడుకోవడం భక్తుల సెంటిమెంట్‌తో చెలగాటమేనని హెచ్చరిస్తున్నా సరే వైసీపీ తన పంథా మార్చుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయ్. ఈ ఫేక్ ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిజాలను సమగ్ర విచారణతో వెలికితీయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నీచ రాజకీయాలు తిరుమల పవిత్రతను ఎట్టిపరిస్థితుల్లోనూ మసకబార్చలేవని హిందూ సంఘాలు స్పష్టం చేశాయి.