Ts Minister Race: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం అమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చారట. తాజా మంత్రి వర్గ విస్తరణలో కనీసం నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నట్లు సమాచారం. సుమారు నాలుగు నుంచి ఐదు కీలక శాఖలు.. సీఎం రేవంత్‌రెడ్డి చేతిలోనే ఉన్నాయి. పైగా కీలకమైన హోం శాఖ కూడా ఆయన చెంతనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంపై ఆశలు పెట్టుకున్న వారి నుంచి తరచుగా ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి.
గత రెండు మూడు మాసాల నుంచి మంత్రి వర్గ విస్తరణపై అదిగో.. ఇదిగో.. అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఎప్పటికప్పుడు ఈ విస్తరణ, లేదా ప్రక్షాళన వాయిదా పడుతూ వస్తోంది. అయితే.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడం.. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై మరింత గట్టిగా పోరాడాల్సిన నేపథ్యంలో సీనియర్లను దారిలో పెట్టుకునేందుకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్న వాదన ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీలు.. ప్రత్యేకంగా తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులతో ఢిల్లీలో భేటీ అయ్యారు. వాస్తవానికి ఇప్పుడు ఇంత అర్జంటుగా చర్చించాల్సిన అంశాలు ఏమీ లేనప్పటికీ.. ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.
Ts Minister Race: దీంతో మంత్రి వర్గ విస్తరణపైనే తాజాగా సమావేశం ఏర్పాటు చేశారని.. రాష్ట్ర స్థాయిలో చర్చ సాగుతోంది. పార్టీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడంతో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణపైనే ఈ చర్చలు సాగుతున్నాయన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. కాగా.. ఇప్పటికే మంత్రివర్గంలోకి చేరాలనుకునే వారి జాబితా పార్టీ అధిష్టానానికి ఎప్పుడో చేరిపోయింది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు సుమారు 10 మంది పేర్లతో ఈ జాబితా ఉండడం గమనార్హం. వీరిలో ఇద్దరు మహిళల పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ జాబితాలో మండలి నుంచి ఇద్దరు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా ఇద్దరు బీసీ నేతలకు, ఒక రెడ్డి సామాజికవర్గం నేతకు, మరో ఎస్సీ సామాజిక వర్గం నేతకు పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. వీరిలో ఓ మహిళా నేత కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 12 మంది మంత్రులు ఉన్నారు. లెక్క ప్రకారం కేబినెట్లో మరో ఆరుగురికి చోటు వుంటుంది. రెండు పెండింగ్‌లో పెట్టాలనే నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. ఆ లెక్కన మంత్రి పదవి దక్కనున్న ఆ నలుగురు ఎవరన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌లు మంత్రి పదవి కోసం పట్టు పడుతున్నారు. వీరిలో వివేక్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, ఇతర అవసరాల దృష్ట్యా వివేక్‌కే మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: minister uttam kumar reddy: డీ వాటరింగ్ ప్రక్రియ జరుగతుంది..
Ts Minister Race: వివేక్ మంత్రి పదవి ఆఫర్‌తోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరినట్లు తెలిసింది. అందుకే ఇచ్చిన మాట ప్రకారం తనకే పదవి వరిస్తుందని సన్నిహితులు చెపుతున్నారు. అయితే వెలమ సామాజికవర్గం నుంచి మంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, మదన్మోహన్, మైనంపల్లి రోహిత్‌లు రేస్‌లో ఉన్నారు. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇవ్వాలా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయట. ప్రేమాసాగర్రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్టు కూడా తెలుస్తోంది. అయినప్పటికీ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేక్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
మరి ఉగాది వేళ కొత్త మంత్రి మండలికి సంబంధించి ఎవరెవరికి తీపి కబురు అందనుందో? టఫ్ కాంపిటేషన్ నేపథ్యంలో రాజపూజ్యం ఎవ్వరికి దక్కనుందో? అవమానాలు, అసంతృఫ్తులు ఏ రేంజ్లో ఉంటాయో? అనే దానిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ మొదలైంది.