SIT On TTD Parakamani

SIT On TTD Parakamani: రాజకీయ క్రీడలో పరాకాష్ట!

SIT On TTD Parakamani: కలియుగ వైకుంఠాధీశుడు శ్రీ వేంకటేశ్వరునితో పెట్టుకుని ఎవ్వడూ తప్పించుకున్న దాఖలాలే చరిత్రలో లేవు. అయితే, స్వామివారి పరాకామణి వ్యవహారంలో 20 ఏళ్లపాటు విదేశీ కరెన్సీ దోపిడీ జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రవికుమార్ అనే చిరుద్యోగి, పెద్ద జీయర్ స్వామి ప్రతినిధిగా హుండీ కానుకల లెక్కింపు చేస్తూ, విదేశీ నోట్లను దొంగతనం చేసి, 142 కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించాడని ఆధారాలు వెలుగు చూశాయి. 2023 ఏప్రిల్ 29న రవికుమార్ 920 అమెరికన్ డాలర్లు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును కేవలం 72,000 రూపాయల దొంగతనంగా చూపి, విజిలెన్స్ అధికారి సహకారంతో లోక్ అదాలత్‌లో రాజీ చేసి మూసివేశారు. అంతేకాదు, రవికుమార్ నుంచి 14 కోట్ల ఆస్తులను విరాళంగా తీసుకునేందుకు టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది, అది కూడా దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, పత్రికా నోటిఫికేషన్ లేకుండా. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు, మాజీ చైర్మన్లు వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో సహా పాలక మండలి సభ్యులు సమష్టి బాధ్యత వహించాల్సిందేనని బీజేపీ నేత, టీటీడీ సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలను బయటపెట్టేందుకు ఆయన ఓ శ్రీవారి భక్తుడితో హైకోర్టులో పిల్ దాఖలు చేయించారు. హైకోర్టు ఆదేశాలతో ఏపీ సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది. మంగళవారం రికార్డులు స్వాధీనం చేసుకున్న సీఐడీ, కోర్టుకు సీల్డ్ కవర్‌లో వివరాలు సమర్పించింది. అయితే, దర్యాప్తు బృందంలోని ఓ సీఐ, ఓ ఎస్సైపై వైసీపీ నేతలకు ఫేవర్‌గా ఉంటున్నారన్న ఆరోపణలు రావడం గమనార్హం. ఇద్దరు అధికారులను దర్యాప్తు నుండి తొలగించాలని కూడా భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజీ లేకుండా చేయడం, ఉద్యోగులను బెదిరించడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.

Also Read: Donald Trump: 25,000 మంది అమెరికన్లు చనిపోయి ఉండేవారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..!

ఇక ఈ కేసును హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. టీటీడీ పాలక మండలి నిద్రావస్థ, పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వంటి వ్యవహారాలన్నీ చూస్తుంటే.. న్యాయస్థానమే న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి రావడంపై భక్తుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు తన ఆస్తులను కాపాడుకునేందుకు, దొంగలను పట్టించేందుకు స్వామివారే స్వయంగా తన భక్తుడితో పిల్‌ వేయించారా అనిపిస్తోంది. కానీ ప్రభుత్వానికి, పోలీసులకు, టీటీడీ పాలకమండలికి మాత్రం ఏ బాధ లేనట్లుంది అన్న విమర్శ వ్యక్తమవుతోంది. శ్రీవారి భక్తుడు శ్రీనివాస్‌ వేసిన పిల్‌పై.. గడువు ఇచ్చినా టీటీడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీసు శాఖ పడుకుందా? స్వామివారి ఆస్తుల విషయంలో టీటీడీ న్యాయ విభాగానికి చిత్త శుద్ధి లేదా? వారిని అలాగే నిద్రపోనివ్వండి.. ఈ కేసును మాత్రం ఊరికే వదిలిపెట్టం అంటూ హైకోర్టు న్యాయమూర్తే అన్నారంటే.. ప్రభుత్వంలో, టీటీడీలో లోపం స్పష్టమవుతోంది. హైకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం, టీటీడీ వ్యవస్థలు కదులుతాయో లేదో మరి. ఇందులో నిజాయితీగా దర్యాప్తు జరిగితేనే అసలు దోషులు బయటపడే అవకాశం ఉంది. అంతే కాదు.. ఈ పరకామణి కుంభకోణంలో సంచలన నాయకుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని భానుప్రకాశ్‌ రెడ్డి లాంటి శ్రీవారి భక్తులు చెబుతున్న సంగతి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *