MPP Challenge to Payyavula: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయం చాలా స్పైసీగా ఉండేది. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించడంతో… నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తోంది. అదే 2024కు ముందు ఉరవకొండ రాజకీయాలు టీడీపీ, వైసీపీల మధ్య ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండేవి.నియోజకవర్గంలో ఎక్కువగా మిర్చి పంట సాగు చేస్తుంటారు. ఎండు మిర్చి ఘాటు ఎలా ఉంటుందో… ఉరవకొండ రాజకీయాలు అంతకు మించి ఘాటుగా ఉండేవి. పయ్యావుల కేశవ్ వర్సెస్ విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్యం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో వెనకబడ్డారని చెప్పొచ్చు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ అనేకసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర మంత్రిగా పని చెయ్యాలన్న ఆయన కోరిక 2024లో నెరవేరిందని చెప్పొచ్చు. సీనియర్ పొలిటిషన్ అవ్వడమే కాకుండా, ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు అంటుంటారు ఆయన అభిమానులు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పయ్యావుల కేశవ్ తనకున్న వాక్చాతుర్యంతో ఎలాంటి సమస్యనైనా సింపుల్‌గా పరిష్కరిస్తారన్న పేరుంది. ఉరవకొండ రాజకీయాలు ఇలా.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా దూసుకెళ్తున్న వేళ.. ఆర్థికశాఖ మంత్రికి సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఒక సవాల్ ఎదురైంది. నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలంలో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ వ్యూహాత్మకంగా వెళ్తుంటే… వైసీపీ మాత్రం పరువు, ప్రతిష్ట సమస్యగా భావిస్తోంది. ఎలాగైనా సరే ఎంపీపీ స్థానాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేక మేడలా కూలిపోయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లోని మండలాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందా పార్టీకి. 2019 నుంచి 2024 మధ్యలో లోకల్ బాడీ ఎన్నికలన్నీ ఏకపక్షంగా వైసీపీ గెలుచుకుంది. అలా మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారు రెండున్నరేళ్ల తర్వాత ఆ పదవిని మరొకరి ఇవ్వాలని అప్పట్లోనే తీర్మానించడం జరిగింది. ఇప్పుడదే 2024లో వైసీపీ ఓటమి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా అనేక తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఆ పార్టీకి. ఇప్పుదు ఉరవకొండలోనూ అదే పరిస్థితి.
Also Read: NDA Manifesto: కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీయే మేనిఫెస్టో
మంత్రి పయ్యావుల కేశవ్ బెలుగుప్ప మండలంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడైన వైసీపీ నేత, ఎంపీపీ పెద్దన్న టీడీపీలో చేరారు. అనేక మంది వైసీపీ ఎంపీటీసీలు కూడా టీడీపీకి మద్దతు పలికారు. దీంతో ఎలాగైన ఎంపీపీ పెద్దన్నను ఆ పదవి నుంచి దింపాలని వైసీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. వైసీపీ హయాంలో 12కు 12 ఎంపీటీసీ స్థానాలను ఆ పార్టీ వారే కైవసం చేసుకున్నారు. ఎంపీపీగా రెండున్నరేళ్లు పెద్దన్న, మరో రెండున్నరేళ్లు శ్రీరంగాపురం ఎంపీటీసీ వరలక్ష్మీ పదవిలో ఉండేలా నాడు పార్టీ నాయకులు తీర్మానించారు. అయితే పెద్దన్న గడువు ముసిగినా, మహిళా ఎంపీపీతో పాలన కొనసాగించడం ఇబ్బందిగా ఉంటుందని, కాబట్టి పెద్దన్ననే ఎంపీపీగా ఉండాలన్న నియోజకవర్గ నాయకుడి ఆదేశాల మేరకు పెద్దన్ననే కొనసాగించారు. ఇక మరో నాలుగు నెలల్లో ఆ పదవీ కాలమూ పూర్తి కానుంది. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటంతో అభివృద్ధి పరుగులు తీసింది. దీంతో పెద్దన్న మంత్రి శిబిరంలో చేరిపోవడం జరిగింది.
ఇటీవల నిర్వహించిన మండల సమావేశంలో ఎంపీపీ పెద్దన్న మాట్లాడుతూ.. ‘మన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. అభివృద్ధి బాగా చేస్తున్నారు. సమష్టిగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకుందాం.’ అంటూ మంత్రిని ప్రశంసించారు. దీన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. పెద్దన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సిద్దమయ్యారు. అంతేకాకుండా గతంలో మాట్లాడుకున్న ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. కాలపరిమితి ముగిసిందని, ఎంపీపీగా దిగిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో అభివృద్ధివైపు మొగ్గు చూపిన పెద్దన్న.. మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎలాగైనా పెద్దన్నను ఎంపీపీగా తొలగించాలని.. అవిశ్వాసం పెట్టాలని.. 10 మంది ఎంపీటీసీలు ఆర్డీఓ వద్ద సంతకాలు చేశారు. కాగా, ప్రస్తుతం తగ్గుపర్తి, బెళుగుప్ప, బెళుగుప్ప తండా ఎంపీటీసీలు పెద్దన్నకు అనుకూలంగా ఉన్నారు. ఈనెల 17న నిర్వహించిన మండల సమావేశానికి కేవలం ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. దీంతో వైసీపీలో ఆశలు సన్నగిల్లాయి. అవిశ్వాసంలో నెగ్గాలంటే 12 మంది ఎంపీటీసీల్లో 8 మంది మద్దతు అవసరం. కానీ వైసీపీ పక్షాన ఏడుగురే నిలిచారు. మరో ఎంపీటీసీ మద్దతు తప్పనిసరి. కాలువపల్లి ఎంపీటీసీని తమ వైపు తిప్పుకుంటే నెగ్గుతామన్నా ఆలోచనతో వైసీపీ నాయకులు రాయబేరాలు నడుపుతున్నారు. టీడీపీ నాయకులు కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తమదే విజయమంటూ టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


