Lokesh Good News: వినాయక చవితి, దసరా వంటి పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో.. గణేశ్ ఉత్సవ మండపాలు, దసరా సందర్భంగా ఏర్పాటయ్యే దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనతో గణేష్ ఉత్సవ సమితులు, మండప నిర్వాహకులు లోకేశ్‌తో పాటు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. ఈ సందర్భంగా సుమారు 15 వేల గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. ఈ మండపాలకు విద్యుత్ ఖర్చు భారం తగ్గించాలని ఉత్సవ సమితులు, నిర్వాహకులు మంత్రి లోకేశ్‌ను కోరారు. ఈ వినతిని సీరియస్‌గా తీసుకున్న లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లతో చర్చించారు. ఈ చర్చల్లో గణేశ్ ఉత్సవాలతో పాటు, దసరా సందర్భంగా ఏర్పాటయ్యే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించారు. ఈ రెండు ఉత్సవాల కోసం రూ.25 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేసినప్పటికీ, శుభకార్యాల కోసం ఈ వ్యయం తగినదేనని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. లోకేశ్ వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం, ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రత్యేక జీవో విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలోని కోట్లాది గణేష్, దుర్గామాత భక్తులకు సౌలభ్యం కల్పిస్తుందని, ఉత్సవాలు మరింత ఘనంగా జరుగుతాయని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: US Tariffs on India: రేపటి నుంచే అమల్లోకి అమెరికా కొత్త టారిఫ్‌లు.. నోటీసు జారీ చేసిన అమెరికా
ప్రజల పల్స్‌ను పట్టుకోవడంలో లోకేష్‌కు ఉన్న సామర్థ్యానికి అద్ధం పడుతోంది ఈ నిర్ణయం. పండుగల సమయంలో భక్తులకు ఆర్థిక భారం తగ్గించే ఈ చర్య, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తోందనే సంకేతాన్ని ఇస్తోంది. గణేశ్ ఉత్సవాలు, దసరా వేడుకలు ఈ ఏడాది మరింత శోభాయమానంగా జరగనున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.