Koona and Tammineni: ఒకే వేదికపై మామా అల్లుళ్లు. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చింది ఎవరు? సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్న మామా అల్లుళ్లు.. ఒకే వేదికపై ఎలా కుదురుకున్నారు? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఇదే హాట్ టాపిక్.
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇద్దరూ మామా అల్లుళ్లు. బావా బామ్మర్దులు కూడా. ఐనా ఆ ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇద్దరు రెండు వేర్వేరు పార్టీల్లో ఉంటూ తమ రాజకీయాల కోసం నిత్యం కత్తులు దూసుకుంటుంటారు. దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం గత ఐదేళ్లలో వ్యక్తిగత వైరంగానూ మారింది. వైసీపీ అధికారంలో ఉండగా అల్లుడిని జైలుకి పంపిన మామపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు కూన రవికుమార్. తమ్మినేని నకిలీ సర్టిఫికెట్లతో లా పరీక్షలు రాశారంటూ మామపై సంచలన ఆరోపణలు తెరపైకి తెచ్చారు. అసలు వీరి వైరం ఇప్పటిది కాదు. ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన తమ్మినేని 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దాంతో అప్పటివరకు తమ్మినేని వెంటే ఉన్న ఆయన మేనల్లుడు కం బామ్మర్ది కూన రవికుమార్… తమ్మినేనికి ప్రత్యర్థిగా మారారు. అయితే 2009 ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోగా, కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస సీటుని ఎగరేసుకు పోయింది. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తమ్మినేనిపై గెలిచి, కూన రవికుమార్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో కూనని ఓడించి తమ్మినేని అసెంబ్లీ స్పీకర్‌గా పదవి చేపడితే, గత 2024 ఎన్నికల్లో తమ్మినేని ఓడించి కూన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. వైసీపీ హయాంలో పోలీసు కేసుల నుంచి తప్పించుకునేందుకు కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో సహజంగానే తమ్మినేనిపై అస్త్రాలను ఎక్కుపెట్టారు ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆ క్రమంలోనే నకిలీ సర్టిఫికెట్లతో లా పరీక్షలు రాశారంటూ తమ్మినేనిపై ఆరోపణలు చేశారు.
Also Read: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్‌ల విచారణకు ఈడీ అభ్యర్థన
Koona and Tammineni: వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా కొనసాగిన తమ్మినేని సీతారాం… అప్పట్లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కూన రవికుమార్‌ని ఏ ఒక్క ఫంక్షన్‌ని కూడా పిలిచిన దాఖలాలు లేవు. అలాంటిది ఆమదాలవలస నియోజకవర్గం మెట్టక్కివలసలోని గాంధీనగర్ కాలనీలో చేపట్టిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మరి ఇద్దరూ కూడా ఎలా హాజరయ్యారు? అనేది ఎవరికీ కూడా అంతుచిక్కని విషయంగా మారింది. మామా, అల్లుళ్ల మధ్య ఈ అంతు పట్టని రహస్యం ఏంటో ఎవరికీ తెలియక సతమతమవుతూ తలలు పట్టుకుంటున్నారట. ఏది ఏమైనా… బద్ధ శత్రువులుగా ఉన్న మామా అల్లుళ్లు ఒకే రోజు.. ఒకే కార్యక్రమంలో సూర్యచంద్రుల్లా తలుక్కుమని మెరిశారు. మామా అల్లుళ్ల మధ్య అసలు ఏం జరుగుతోంది అంటూ అదే కార్యక్రమంలో పలువురు గుసగుసలాడుకున్నారంట. ఏంటీ విడ్డూరం? పొలిటికల్ డ్రామానా? లేక ఇంకేమైనా జరుగుతోందా? అంటూ చర్చించుకున్నారట ఆల్ పార్టీల క్యాడర్, లీడర్లు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం, జనసేన నాయకుడు రామ్మోహన్.. ఇలా మూడు పార్టీల నేతలు ఒకే వేదిక మీద కనపడడంతో ఇదొక అపురూప ఘట్టం అంటూ విశ్లేషిస్తున్నారు సిక్కోలు పొలిటికల్ అనలిస్టులు.