TVK Vijay: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన టీవీకే అధినేత విజయ్‌కు ఇప్పుడు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిసి అవకాశం కోరిన సంగతి తెలిసిందే. తన వద్ద 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటానని విజయ్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పూర్తి సంతృప్తిగా లేరని, విజయ్ వాదనతో ఆయన ఏకీభవించడం లేదని సమాచారం అందుతోంది.
గవర్నర్ నిర్ణయం ఒకవైపు ఇబ్బందిగా మారితే, మరోవైపు చిన్న పార్టీలు కూడా విజయ్‌కు షాకిచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినప్పటికీ, వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఈ పార్టీల దగ్గర చెరో రెండు సీట్ల చొప్పున బలం ఉంది. ఈ చిన్న పార్టీలు గనుక మద్దతు ఇచ్చి ఉంటే విజయ్ సులభంగా మెజారిటీ మార్కును దాటేవారు. కానీ, తాము డీఎంకే కూటమితోనే కొనసాగుతామని ఆ పార్టీలు స్పష్టం చేయడంతో విజయ్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మద్దతు లేఖలో పేర్కొన్న సంఖ్యపై గవర్నర్ అసంతృప్తిగా ఉండటం, మిత్రపక్షాలు దూరంగా జరగడంతో విజయ్ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో, ఈ రాజకీయ సమీకరణాలు మారడం విజయ్‌కు పెద్ద పరీక్షగా నిలిచింది. మరి ఈ సంక్షోభం నుంచి విజయ్ ఎలా బయటపడతారో చూడాలి.
