TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందడుగు వేశారు. బుధవారం సాయంత్రం చెన్నైలోని లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను విజయ్ తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి కలిశారు. తన వెనుక 112 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలుపుతూ వారికి సంబంధించిన మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
మద్దతు లేఖతో పాటు తన కేబినెట్లో ఉండబోయే 20 మంది మంత్రుల జాబితాను కూడా విజయ్ గవర్నర్‌కు సమర్పించారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్‌కు, కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని చిన్న పార్టీలు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయన బలం 112కి చేరింది.
విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్ధమైంది. రేపు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా హాజరుకానుండటం విశేషం. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో, విజయ్ కేబినెట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతుండటంతో తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంది.
