Ap News: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నిర్వహించిన డీఎస్సీ పరీక్షలపై విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. మెగా డీఎస్సీ కింద నిర్వహించిన పలు సబ్జెక్టులకి సంబంధించిన ప్రాథమిక కీలు (Primary Keys)ను అధికారికంగా విడుదల చేసింది.
డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి వెల్లడించిన ప్రకారం, జూన్ 6 నుంచి 28 వ తేదీ మధ్య నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీలు ప్రస్తుతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.
ఈ విడతలో SGT, స్కూల్ అసిస్టెంట్, TGT, PGT, PET తదితర విభాగాలకు సంబంధించిన కీలు విడుదల చేశారు. ఈ కీలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు సంబంధిత ఆధారాలతో జులై 11వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేయవచ్చు.
అలాగే, జూన్ 29 నుంచి జులై 2 మధ్య జరిగిన పరీక్షల ప్రాథమిక కీలు, రెస్పాన్స్ షీట్లు కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. బుధవారం నాటికి డీఎస్సీ పరీక్షల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, తదుపరి కార్యక్రమాలను విద్యాశాఖ వేగంగా కొనసాగిస్తోంది.