Nominated Posts

Nominated Posts: తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ.. 18 కార్పొరేషన్ల చైర్మన్ల పూర్తి జాబితా ఇదే!

Nominated Posts: తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేషన్లకు బాధ్యులను ఖరారు చేశారు.

ముఖ్యమైన నియామకాల్లో భాగంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్‌ను నియమించారు. అలాగే, గీత కార్మికుల కార్పొరేషన్‌ బాధ్యతలను మోతుకూరి చంద్రశేఖర్‌ గౌడ్‌కు, మేర సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సంగా వెంకటరాజంను ఎంపిక చేశారు. చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌కు దూదెం వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్‌కు బండి రమేష్‌, వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జువ్వాది నర్సింగ్‌రావు నియమితులయ్యారు. విద్యా రంగానికి సంబంధించి తెలంగాణ తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ వెంకటనారాయణకు బాధ్యతలు అప్పగించారు.

బీసీ కుల సంఘాల కార్పొరేషన్ల భర్తీపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మున్నూరు కాపు కార్పొరేషన్‌కు బొమ్మ శ్రీరామ్‌, యాదవ కార్పొరేషన్‌కు రఘునాథ్‌ యాదవ్‌, వడ్డెర కార్పొరేషన్‌కు గుంజ రేణుక నారాయణ, పద్మశాలి కార్పొరేషన్‌కు గూడురు శ్రీనివాస్‌లను ఛైర్మన్లుగా ప్రకటించారు. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌కు కొల్లె సరిత, లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌లు ఎంపికయ్యారు. అలాగే వాషర్‌మెన్‌ కార్పొరేషన్‌కు అజయ్‌ కుమార్‌, పెరిక కార్పొరేషన్‌కు దొంగారి వెంకటేశ్వర్లు, వాల్మీకి బోయ కార్పొరేషన్‌కు గట్టు తిమ్మప్పలను నియమించారు.

పరిపాలన విభాగాల్లో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా సూదిని రామిరెడ్డి నియమితులయ్యారు. ఇదే ట్రైబ్యునల్‌లో సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్‌, బూసా వేణుగోపాల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. భట్టరాజ కోఆపరేటివ్‌ సొసైటీ ఫెడరేషన్‌ చైర్మన్‌గా సీహెచ్‌ బాలరాజును ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాలతో రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *