Konda Surekha Miss Fires

Konda Surekha Miss Fires: ఫైర్‌ బ్రాండ్‌కే మంటలు పుట్టించిన పచ్చి నిజాలు!

Konda Surekha Miss Fires: మంత్రుల పేషీల్లో ఫైళ్ల క్లియరెన్స్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలతో.. కాంగ్రెస్‌ మంత్రులంతా.. ఇదేం ఖర్మరా భగవంతుడా.. అంటూ తలలు పట్టుకుంటున్నారట. ”రాజకీయం అంటేనే రంగస్థలం. ఇక్కడ రాణించాలంటే నటించడం బాగా రావాలి. ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకోవాలి. అందులో ఆరితేరిన వారు పైకి ఎగబాకుతుంటారు. స్నేక్స్‌ అండ్‌ ల్యాడర్స్‌ గేమ్‌ లాంటి పాలిటిక్స్‌లో.. ఎంతో మందితో పోటీ పడి, ఎంతో కష్టపడితే.. ఈ స్థాయికి చేరుకున్నాం. ఇలా మన గుట్టు మనమే విప్పుకుంటే ఎలా?” అన్నది ఇప్పుడు తెలంగాణ మంత్రుల పేషీల్లో ట్రెండింగ్‌ డిస్కషన్‌గా మారిపోయిందట. మంత్రి సురేఖ చేసిన కామెంట్లు ఆ రేంజ్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి మరి. వాస్తవానికి కొండా సురేఖ అన్న మాటలు పచ్చి నిజాలు. ఎవరు అవునన్నా, కాదన్నా సుద్ధపూసలెవరూ లేరిక్కడ. కమీషన్లు ముట్టనిదే.. అదేనండీ.. రాజకీయ నాయకుల భాషలోనే చెప్పాలంటే.. చేతులు తడవనిదే.. మంత్రులు, అధికారుల పేషీల్లో ఎన్ని ఫైళ్లు స్ట్రయిట్‌గా ముందుకెళ్తాయో లోక విధితమే. అది ఏ ప్రభుత్వమైనా వర్తించేదే. ఇది కొండా సురేఖనే చెప్పనక్కర్లేదు.. సామాన్య జనాలకు సైతం తెలియనిదీ కాదు.

ఇంతకీ కొండా సురేఖ అసలు ఏమన్నారో చూద్దాం… వరంగల్‌లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో కొత్త భవనం నిర్మించేందుకు అరబిందో ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో భవన నిర్మాణానికి మే 17న శంకుస్థాపన చేశారు మంత్రి కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మంత్రుల వద్దకు ఫైల్స్‌ వస్తుంటాయని, కొందరు కమీషన్లు తీసుకుని ఫైల్స్‌ క్లియర్‌ చేస్తుంటారనీ, తాను మాత్రం నయా పైసా కూడా వద్దన్నాననీ, కళాశాలను అభివృద్ధి చేస్తే చాలన్నానని చెప్పుకొచ్చారు. కొండా సురేఖ.. లోపల ఒకటి పెట్టుకుని, బయటకు ఇంకొకటి మాట్లాడే రకం పొలిటీషియన్‌ కాదన్నది ఆమెకున్న గుడ్‌ విల్‌. అందుకు తగ్గట్టే ఈ కామెంట్స్‌ చేశారామె.

ఇక కొండా కామెంట్స్‌కి కాంగ్రెస్‌ మంత్రులు నొప్పి బయటకు కనిపించనీయకుండా నొచ్చుకుంటుంటే… బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు చంకలు గుద్దుకుంటూ విమర్శలు చేస్తుండటం మరీ విడ్డూరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. కొండా సురేఖ వ్యాఖ్యలు తాజా కాంగ్రెస్‌ మంత్రులకు వర్తిస్తే.. మాజీ బీఆర్‌ఎస్‌ మంత్రులకు వర్తించకుండా పోతాయా? అన్నది కామన్‌సెన్స్‌ ఉన్నోడు ఎవడైనా లేవదీసే లాజిక్‌. ఆ లాజిక్‌ మిస్‌ అయిన కేటీఆర్‌.. సురేఖ కామెంట్స్‌పై మరీ విడ్డూరంగా స్పందించారు. నిజాలు మాట్లాడినందుకు కొండా సురేఖకు అభినందనలు అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్‌.. తెలంగాణలో కాంగ్రెస్‌ కమీషన్ల సర్కార్‌ నడుపుతోందంటూ పల్లవి అందుకున్నారు. దీంతో కొండా సురేఖ జరిగిన తప్పును కవర్‌ చేసుకోక తప్పలేదు. తాను మాట్లాడింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో లంచాలు తీసుకున్న మంత్రుల గురించే తప్ప, కాంగ్రెస్‌ మంత్రుల గురించి కాదని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి నిజం మాట్లాడినా ఇరుకున పడ్డారు కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ. అందుకే అంటారు నిజం నిప్పులాంటిది, ముట్టుకుంటే కాలుతుందని.

ALSO READ  Short News: తిరుమలలో అగ్ని ప్రమాదం.. గెస్ట్ హౌస్ దగ్గర కారు దగ్ధం

Also Read: Narendra Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత రేపు రాజస్థాన్‌లో ప్రధాని తొలి పర్యటన

Konda Surekha Miss Fires: కొండా సురేఖ ఫ్రైర్‌ బ్రాండ్ ఊరికే అవ్వలేదు. సురేఖ వ్యాఖ్యలు.. ఎప్పుడైనా, ఎవరిపై చేసినా అవి ముల్లులా గుచ్చుకుంటాయి. అవి మానడం అంత సులభం కూడా కాదు. వైఎస్సార్‌ మరణం తర్వాత జగన్‌ పక్షాన నిలబడి, తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సురేఖ.. అప్పట్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని.. సోనియా చాలా కాలం పాటు గుర్తు పెట్టుకున్నారట. అందుకే.. ఆ తర్వాత రెండేళ్లకు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి.. తిరిగి సొంత గూటికి చేరాలని సురేఖ ప్రయత్నించినప్పటికీ సోనియా కాదనేశారట. కానీ చివరికి కొండా సురేఖను పోరాట యోధురాలనే పేర్కొన్నారు సోనియా గాంధీ. ఎందుకంటే జగన్‌ కోసం నిలబడి సోనియాపై తీవ్ర విమర్శలు చేసిన సురేఖ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతూ జగన్‌పై అంతకంటే ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్, అట్నుంచి తిరిగి కాంగ్రెస్‌కు చేరింది సురేఖ జర్నీ. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మరోసారి మంత్రి అయిన సురేఖ.. తరచూ తన మాటలతో తనే ఇబ్బందులు, వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న సంగతీ తెలిసిందే. ఒకప్పుడు తన మాటల తూటాలతో ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే ఒణికించేసేవారు కొండా సురేఖ. ఇప్పుడు తన మాటలతో తనే తరచూ సెల్ప్‌ గోల్స్‌ వేసుకుంటున్నారు. ఇకనుంచైనా సురేఖ మాట్లాడేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటరేమో అని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *