KCR Brand Missing : బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలో ఎక్కువ శాతం స్క్రిప్ట్ కావడంతో ఆయన ప్రసంగంలో జీవం కనిపించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత అధినేత కేసీఆర్ పాల్గొన్న రెండవ సభ ఇది. ఏడాదిన్నర తర్వాత ఫక్తు రాజకీయ ప్రయోజనం కోసమే కాకుండా, పార్టీ, నాయకత్వం, శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు ఈ సభ దోహదం చేస్తుందని భావించారు. ఈ సభలో ఇతర నాయకులెవరూ మాట్లాడకుండా ఒక్క కేసీఆర్ మాత్రమే ప్రసంగించారు.
సహజంగా కేసీఆర్ పాల్గొనే ఏ సభలో కూడా ఆయనొక్కరే మాట్లాడటం సాధారణ విషయమే. ఈ సంప్రదాయాన్నే కొనసాగించినప్పటికీ ఆయన ముందుగా రాసుకున్న దాన్ని చూస్తూ మాట్లాడటంతో ఫ్లో తగ్గిందనే అభిప్రాయం వినిపించింది. కేసీఆర్ ఉపన్యాసంలో సహజంగా ఉండే తీవ్రత తగ్గిపోయింది. తన ప్రసంగం చివరలో పాత పద్ధతిలో మాట్లాడటంతో పాత ధోరణిలో సాగింది. చాలా కాలంగా ప్రసంగాలకు దూరంగా ఉండటం, వయస్సు కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఏమైనా ఈ సభకు ముందు ఆయన ఏం మాట్లాడాలనే అంశంపై జరిగిన తెర వెనుక చర్చ ఫలితంగా అన్ని అంశాలను మాట్లాడాలనే ప్రయత్నం వల్ల… స్క్రిప్ట్ తెరపైకి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా పాయింట్లు రాసుకునే సందర్భాలుంటాయి. కానీ దీనికి భిన్నంగా చెప్పాల్సినవి అన్నీ రాసుకొని చదివినట్లు అనిపించింది. దీనికి తోడు గతంలో ఇదే తరహా ప్రసంగం కేటీఆర్ అసెంబ్లీలో చేశారనే చర్చ సాగింది. ఏడాదిన్నర కాలంగా ప్రత్యక్షంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు దూరంగా ఉన్న కేసీఆర్‌లో ఆ తేడా స్పష్టంగా కనిపించింది. గత ఎన్నికల ఓటమి వల్ల కోల్పోయిన కేసీఆర్ ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేందుకు రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఈ భారీ సభను పార్టీ భుజానికెత్తుకున్నట్లగా కనిపిస్తున్నది. ఈ ముందస్తు జాగ్రత్త వల్ల కేసీఆర్ ఏడాదిన్నర కాలంగా ఎక్కడా మాట్లాడకుండా ఉన్నట్లు భావించాల్సి వస్తోంది. తిరిగి ఆయన ఉపన్యాసం జనం ఎదురుచూస్తున్నట్లుగా ఒక చర్చను లేవనెత్తి కేసీఆర్ స్థాయిని మరోసారి పెంచేందుకు ప్రయత్నించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహజంగా ప్రాంతీయ పార్టీలో నేత ప్రతిష్ఠ ప్రధానం కాబట్టి అదే ఎత్తుగడను బీఆర్ఎస్ ఈ సందర్భంగా ప్రదర్శించినట్లు భావిస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, పాలనపరమైన నిర్ణయాలు, లోపాలపైనే బీఆర్ఎస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. కేసీఆర్ ప్రసంగంలో ఈ విషయం స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకావడంలేదనే ముద్ర వేసేందుకు మరోసారి ప్రయత్నించారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని చెప్పేందుకు యత్నించారు.
తమ పదేండ్ల పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై తనకున్న విల్లమాలిన ప్రేమను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సెంటిమెంటును పెంచేందుకు యత్నించారు. రాష్ట్రం నాశనమవుతుంటే చూడలేకపోతున్నట్లు చెబుతూనే తనకు దుఖం వస్తుందంటూ గద్గదస్వరంతో మాట్లాడారు. ఇదే వేదికపై నుంచి మరోసారి పద్నాలుగేళ్ల తన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని చెబుతూ తెలంగాణ సెంటిమెంటు తమ పార్టీ స్వంతమని చెప్పేందుకు యత్నించారు. పదేండ్ల పాలనపై ఒక్కమాట కూడా ఆత్మవిమర్శ లేకపోవడం గమనార్హం. చివరికి కాళేశ్వరం అంశంలో కూడా అదే తీరు ప్రదర్శించారు. చివరగా బీజేపీపై తప్పదన్నట్లు విమర్శలు చేశారనే చర్చ సాగుతోంది. తన టార్గెట్ అంతా కాంగ్రెస్‌గానే ప్రసంగం సాగింది. బీజేపీని అంటీ ముట్టనట్లు విమర్శించారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సందర్భంగా నక్సలైట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి కేంద్రం ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటూ కోరారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఆదివాసీల ఊచకోత గురించి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది కాదంటూ పేర్కొనడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పటి కేసీఆర్ కంటే ఉద్యమకాలంలో కేసీఆర్ మాటలు గుర్తుకు వచ్చాయనే చర్చ సాగుతోంది.