Kaleshwaram Report

Kaleshwaram Report: కేసీఆర్‌తో సహా వారందరిపై చర్యలు: కమిషన్‌ సిఫార్సు

Kaleshwaram Report: కేసీఆర్ పై చర్యకు కాళేశ్వరం కమిషన్ సిఫార్సు చేసింది. ప్రభుత్వ సారధిగా జరిగిన నష్టానికి ఆయనే బాద్యుడు అని పేర్కొంది. బ్యారేజీలకు కలిగిన నష్టానికి బాద్యుడిగా ప్రభుత్వం కేసీఆర్ పై తగిన చర్య తీసుకోవచ్చని వెల్లడించింది. హరీష్ రావు, ఈటెల రాజేందర్‌పై చర్యకు పరిశీలించవచ్చని సూచించింది. హరీష్ రావు, ఈటెల.. ఇద్దరూ కేసీఆర్‌కు సహకరించే విధంగా వ్యవహరించారనీ, ఇక అధికారులకు తగిన శిక్ష వేయాలని, అధికారులపై మానవతా దృక్పదంతో సానుభూతి చూపితే రాష్ట్ర సంక్షేమానికి విఘాతం అవుతుందని అభిప్రాయపడింది. మేడిగడ్డ పునరుద్దరణ బాధ్యత కాంట్రాక్టర్ L&Tదే అని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ళలో లోపాల సవరణ బాధ్యత కాంట్రాక్టర్లదేని స్పష్టం చేసింది.

“మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ… 3 బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కేసీఆర్‌దే. ఇది కేసీఆర్ స్వంత నిర్ణయం. రీ ఇంజినీరింగ్ పేరిట నిర్ణయం తీసుకున్నది కూడా కేసీఆరే. కేసీఆర్ నిర్ణయం, ప్రమేయమే.. 3 బ్యారేజీల ప్రస్తుత స్థితి, అక్రమాలకు కారణం. మేడిగడ్డ సరైన ప్లేస్ కాదని చెప్పినా.. నిపుణుల కమిటీ నివేదికను తొక్కి పెట్టి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బ్యారేజీల స్థితి చూడకుండా ప్రారంభించడం దగ్గర నుంచీ పూర్తి స్థాయి నీటిమట్టం నిలపాలన్న నిర్ణయం వరకూ అంతా కేసీఆరే చూశారు, చేశారు. హరీష్ రావు, ఈటెల కేవలం కేసీఆర్‌కు సహాయకారులుగా మిగిలారు. ప్రభుత్వ సారధిగా జరిగిన నష్టానికి తప్పని సరిగా కేసీఆరే బాధ్యుడు అవుతారు.” అంటూ కాళేశ్వరంపై నివేదికలో పీసీ ఘోష్‌ కమిషన్‌ స్పష్టంగా పేర్కొంది.

“నాటి ఆర్హిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావనకే పరిమితమయ్యారు. కేబినెట్ ఆమోదించకుండానే ఆమోదించినట్లు బడ్జెట్లో కూడా ఈటెల తప్పు చెప్పారు. పరిపాలన ఆమోద ఉత్తర్వుల్లో మంత్రులు హరీష్ రావు, కేసీఆర్ సంతకాలే ఉన్నాయి. కానీ, నాటి ఆర్ధిక మంత్రి ఈటెల సంతకం లేదు. కేబినెట్ సబ్ కమిటీ, ఆపైన మంత్రి వర్గంలో ఆమోదం తరువాత 3 బ్యారేజీలకు పరిపాలన ఆమోదం తెలిపామని కమిషన్‌కు ఈటెల తెలిపారు. కానీ ఈటెల చెప్పింది తప్పు. కేబినెట్ సబ్ కమిటీ 3 బ్యారేజీలు అసలు సిఫార్సే చేయలేదు…” అంటూ కమిషన్ అప్పటి ఆర్థిక మంత్రి ఈటల పాత్రను కూడా నివేదికలో స్పష్టం చేసింది. ఆర్ధిక శాఖ బడ్జెట్‌కు సంబంధింది… కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు ఆఫ్ బడ్జెట్ కిందకు వస్తాయి. అయితే.. అవి ఇరిగేషన్ కిందకు వస్తాయన్న ఈటెలను కమిషన్ తప్పుపట్టింది. మంత్రిగా ఆయన ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.

ALSO READ  Suresh Wife-Anil Wife: జగన్‌ని నమ్ముకున్నోళ్లు అందాకా ఆగక్కర్లేదా?

Also Read: RS Praveen Kumar: బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్

2016 జనవరిలో 3 బ్యారేజీలు… మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేసీఆర్‌ ప్రభుత్వం. అయితే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరైంది కాదని నిపుణుల కమిటీ అప్పటికే హెచ్చరించింది. మేడిగడ్డ బదులు ప్రాణ హిత మీద వేమనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలని సిఫార్సు చేసింది. అయితే నిపుణుల కమిటీ నివేదికను కోల్డ్ స్టొరేజ్‌లో పెట్టింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. 2016 మార్చిలో వేసిన కాబినెట్ సబ్ కమిటీ కూడా 3 బ్యారేజీల నిర్మాణంపై ఎలాంటి సిఫార్సు చేయలేదు. 2016 మార్చి 1న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వుల జారీ అయ్యాయి. కేబినెట్ ఆమోదం లేకుండా ఆదేశాలు పాస్‌ చేశారు. ఇలా.. ప్రాణ హిత చేవెళ్ళ బదులు రీఇంజినీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆలోచన, అమలు నిర్ణయం కేసీఆర్‌దే అని కమిషన్‌ నిర్ధారించింది. అంతేకాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆర్ధిక అంశాలపై కేంద్ర జల సంఘం పరిశీలన పూర్తి కాకముందే… 2018 మార్చి నాటికి 80,190 కోట్లకు గాను రూ.30,653 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర జల సంఘంకు డీపీఆర్ సమర్పించకుండానే అప్రూవల్స్ ఇచ్చేశారు. సవరించిన అంచనాల పేరిట రూ.15,573 కోట్లకు అదనపు ఆమోదం తెలిపారు.
ఈ అంశాల్లో ఆర్ధిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు 3 బ్యారేజీల ఫండింగ్ విషయంలో తమకు పట్టనట్లుగా వ్యవహరించారని కాళేశ్వరం కమిషన్‌ ఆక్షేపించింది.

కాళేశ్వరం కమిషన్‌ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ జరిగితే… ఈ అంశాలన్నీ ప్రజల్లోకి వెళితే… ప్రజల ముందు కేసీఆరే దోషిగా నిలబడాల్సి వస్తోంది. అందుకే బీఆర్‌ఎస్‌ అసలు ఈ నివేదికను పరిగణలోకి తీసుకోకూడదని వాదిస్తోంది, దీనిపై ఎలాంటి చర్చ జరగకూడదని కోరుకుంటోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *