KA Paul Timing: తెలంగాణ రాజకీయ రంగస్థలంలో సీరియస్ డ్రామా నడుస్తుంటే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మామూలుగా కాదు, కామెడీ ట్విస్ట్‌తో ఎంట్రీ ఇచ్చారు! బీఆర్ఎస్‌తో విభేదాల తర్వాత కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేళ, రాజకీయ చర్చలు హోరెత్తుతున్నాయి. కవిత సొంత పార్టీ పెట్టబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల్లో చేరరని కూడా ఆమె స్పష్టం చేసిన నేపథ్యంలో… కేఏ పాల్ తెరపైకి దూసుకొచ్చారు. కవితకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన ప్రజాశాంతి పార్టీలో చేరి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటూ కవితకు బంపర్ ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్.
కేఏ పాల్ కేవలం ఆఫర్ మాత్రమే ఇవ్వలేదండోయ్. తనదైన స్టైల్‌లో లాజిక్ కూడా చెప్పారు. బీజేపీ బ్రాహ్మణుల పార్టీ అని, కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని, బీఆర్ఎస్ దొరల పార్టీ అని… బీసీల కోసం పోరాడాలనుకునే కవితకు బీసీల పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీయే బెస్ట్ ఛాయిస్ అని వివరం సవివరంగా తెలియజేశారు. కవిత సై అంటే.. వెంటనే కండువా రెడీగా ఉందని, జూబ్లీహిల్స్‌లో పోటీ చేసేందుకు బీ-ఫామ్ కూడా సిద్ధంగా ఉందని, గెలిచి తనపై వస్తోన్న ఆరోపణలను తిప్పికొచ్చొచ్చని సలహా ఇచ్చారు. గతంలో గద్ధర్, బాబూ మోహన్ వంటి నాయకులు సైతం తన పార్టీలో చేరిన వారేనని గుర్తు చేస్తూ.. కవిత కూడా తన ప్రజాశాంతి పార్టీలోకి రావాల్సిందేనని పట్టు బట్టారు పాల్.
Also Read: Kim Jong Un: కొడుకుని కాదని.. కూతురిని ప్రమోట్ చేస్తున్న కిమ్..?
అయితే… తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్న కవిత… కేఏ పాల్ పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరి, ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడతారా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కేఏ పాల్ రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నా, గ్రౌండ్ రియాలిటీ తెలియని అమాయకుడిలానే మిగిలిపోయారు పాపం. ఇతర రాజకీయ పార్టీలకు తనది రాజకీయంలా అనిపించొచ్చు కానీ.. తనకు మాత్రం ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్ అని కవిత అంటున్నారు. మరి పాల్ ఆఫర్‌ని ఆమె ఎంత వరకూ సీరియస్‌గా తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ… సీరియస్‌గా నడుస్తోన్న రాజకీయ హడావుడిలోనూ… పాల్ ఎంట్రీ.. కాస్త రిలీఫ్ ఇచ్చిందనడంలో సందేహం లేదు.

