Jogi Chapter Close: వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి.. ఇసుక, లిక్కర్ వంటి ఆదాయ వనరులపై ఆధిపత్యం చెలాయిస్తూ.. దోపిడీ సామ్రాజ్యం నడిపారన్న ఆరోపణలున్నాయి. అన్ని స్కాముల్లోనూ ఆయనే అంతిమ లబ్దిదారుడుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే, ఈ మాఫియా సామ్రాజ్యంలో ఎవరి స్థాయిలో వారు దండుకున్నవారే. అలా తన స్థాయికి తగ్గ అక్రమాలతో సంతృప్తి పడిన నాయకుల్లో జోగి రమేష్ ఒకరని చెప్పాల్సి వస్తోంది. అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంతో ఆయన రాజకీయ జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది.
అంబాపురంలో ప్రభుత్వం 2019లో జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుట్రపూరితంగా స్వాధీనం చేసుకున్నారనడానికి ఆధారాలు లభించాయి. సర్వే నంబర్ 87లోని 2,293 గజాల భూమిని, పక్కనే ఉన్న సర్వే నంబర్ 88గా నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేయించినట్లు అర్థమౌతోంది. ఈ భూమిని ఏడు ప్లాట్లుగా విభజించి, రహదారితో సహా ప్రహరీ కట్టి, రూ.10 కోట్లకు పైగా లాభం గడించారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ కుంభకోణంలో జోగి రమేష్ తాను ఇరుక్కోవడంతో పాటూ తన కుమారుడు రాజీవ్, బాబాయి వెంకటేశ్వరరావులను కూడా ఇరికించినట్లయింది. సర్వే నంబర్ 87లో ఉన్న నిషేధిత ఆస్తులను.. సర్వే నంబర్ 88గా చూపించిన జోగి, తన కుమారుడు, బాబాయిల పేరిట వాటిని రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి తహసీల్దార్, రిజిస్ట్రేషన్ అధికారులు కూడా జోగికి సహకరించారు. అమ్మకాల సమయంలో మళ్లీ సర్వే నంబర్ 87గా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి, అక్రమ లాభాలు ఆర్జించారు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల వల్లే ఇప్పుడు జోగి కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంటోంది.
Also Read: Deputy CM Pawan Kalyan: నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్: పవన్ కల్యాణ్ హర్షం
Jogi Chapter Close: అగ్రిగోల్డ్ సంస్థ ఫిర్యాదుతో పోలీసులు, ఏసీబీ, సీఐడీ, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. సర్వే నంబర్ మార్చడం, నకిలీ రిజిస్ట్రేషన్లు, భూముల అక్రమ విక్రయాలు ఆధారాలతో సహా దర్యాప్తులో బట్టబయలయ్యాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ఇప్పటికే జైలుకు వెళ్లి, బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ జోగి రమేష్, ఆయన బాబాయి వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు “ముఫ్పై ఏళ్లు అధికారం మాదే” అన్న ధీమాతో జోగి రమేష్ చేసిన ఈ చిల్లర అక్రమాలు, ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికే సవాల్‌గా మారాయి. వైసీపీ పాలనలో అధికారుల అండదండలతో వైసీపీ నాయకులు ఏవిధంగా అక్రమాలకు పాల్పడ్డారో చెప్పేందుకు ఈ కేసే ఓ ఉదాహరణ. అగ్రిగోల్డ్ భూములను కాజేసిన ఈ కుంభకోణం, వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలకు నిదర్శనం. జోగి రమేష్ ఎపిసోడ్, అధికార దుర్వినియోగం చేసే నాయకులకు హెచ్చరిక.