Jagan Tour: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌లో జరిగిన వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర కాస్తా హైడ్రామాగా మారింది. తోతాపురి మామిడి రైతులకు పరామర్శ పేరిట జగన్ నడిపిన ఈ యాత్ర, రాజకీయ బల ప్రదర్శనగా, కార్యకర్తలకు జాతరగా సాగింది. రైతుల కష్టాలను ఆసరాగా చేసుకొని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నంగా ఈ టూర్‌ను ఎన్డీఏ నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ హైడ్రామా వెనుక అసలు వాస్తవాలేంటి? జగన్ యాత్రతో రైతులకు ఒరిగిందేమిటి? పొలిటికల్ మైలేజ్ తప్ప సమస్యల పరిష్కారం జగన్ అవసరం లేదా? ఈ ప్రశ్నలకు వైసీపీ వద్ద సమాధానాలున్నాయా?
ఈ ఏడాది తోతాపురి మామిడి బంపర్ దిగుబడి కారణంగా ధరలు పడిపోయాయి. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి, పల్ప్ ఇండస్ట్రీలతో చర్చలు జరిపి… కిలోకు 8 రూపాయలు కొనుగోలు ధర, అదనంగా 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి మొత్తం 12 రూపాయల ధర కల్పించింది. దీనిపై ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు సైతం మెచ్చుకున్నారు. అయినా జగన్ ఈ యాత్ర ఎందుకు చేసినట్లు? టీడీపీ నేతలు చెప్పినట్లు, మామిడి సీజన్ ఇప్పటికే ముగిసింది. సీజన్ అయిపోయిన తర్వాత రైతుల పరామర్శ పేరిట జగన్ రోడ్డెక్కడం రాజకీయ స్టంట్ కాదా? జగన్ యాత్రలో రైతుల కంటే వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా పాల్గొనడం వాస్తవం కాదా? పోలీసు ఆంక్షలను ధిక్కరించి, వేలాది మంది కార్యకర్తలు బంగారుపాళ్యంలో తండోపతండాలుగా రోడ్డెక్కడం, ప్రజల్ని భయాందోళనకు గురిచేయడం దేనికి సంకేతం? రైతుల సమస్యల కంటే బల ప్రదర్శనే జగన్ లక్ష్యమా? వైసీపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి తన 25 ఎకరాల మామిడి తోటలో పండించిన పంటను 12 రూపాయల ధరతో విక్రయించుకున్నాడా లేదా?
Also Read: Hyderabad: HCAను రద్దు చేయాలి: క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి
Jagan Tour: ఆయనే స్వయంగా ఐదు ట్రాక్టర్లలో మామిడి లోడును ముందుగానే రెడీ చేసి జగన్ కాన్వాయ్ రాగానే రోడ్డుపై పారబోశాడన్న ఆరోపణలు నిజం కాదా? రైతుల నిరసనని కూడా మీరే ప్లాన్ చేస్తారా? జగన్ యాత్ర రాష్ట్ర శాంతిని భగ్నం చేసేందుకేనని ఆరోపించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి కౌంటర్ ఇవ్వకుండా వైసీపీ నేతలు మౌనం వహించడాన్ని ఎలా చూడాలి? ఆధారాలతో సహా దొరికిపోయాక కౌంటర్ సమాధానాలు ఏం చెబుతాం అని వెనకడుగు వేసిన మాట నిజం కాదా? ప్రభుత్వం ఇప్పటికే రూ.12 ధరను నిర్ధారించిందన్న వాస్తవాన్ని జగన్ తన స్పీచ్‌లో ఎందుకు మరుగున పెట్టారు? చిత్తూరు ఎస్పీ 500 మందికి మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసినా కానీ, వైసీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి గందరగోళం సృష్టించారు. ఈ ధిక్కారం రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడానికి కాదా? రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్న వేళ ఈ యాత్రల హైడ్రామా రాజకీయ లబ్ధికోసం వైసీపీ వేసుకున్న చీప్ ట్రిక్ కాదా? వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పల్ప్ ఫ్యాక్టరీలు కలిగి ఉండి కూడా, 12 రూపాయలకు మామిడి కొనుగోలు చేయడం లేదని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. అంటే రైతుల ద్రోహి పెద్దిరెడ్డిని జగన్ ఏమీ చేయలేని అసమర్థుడా? ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు వైసీపీ వద్ద సమాధానం ఉందా?