Errabelli: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ రాజకీయం నడుస్తుంది. మొన్నటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు కనుసన్నల్లో జరిగేది. పార్టీలో ఆయన చెప్పినట్టే నడిచేది. అధినేత కేసీఆర్ కూడా ఎర్రబెల్లికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయనతోనే అన్ని వ్యవహారాలు నడిపించేవాడు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఎర్రబెల్లి ఓడిపోయారు. ఆయన వరుస విజయాలకు బ్రేక్ పడింది. 1994లో మొదలైన ఎర్రబెల్లి విజయాల పరంపర 2023 వరకు అప్రహతికంగా కొనసాగింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు.
కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దయాకర్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ మాత్రం పట్టులేని కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి రాజకీయాల్లో ఆయన ప్రభ తగ్గుతుందనే టాక్ నడుస్తుంది. ఇంటా, బయటా దయాకర్ రావు ప్రాధాన్యత కోల్పోతున్నారనే చర్చ మొదలైంది. దయాకర్ రావు అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మాటకు విలువ ఉండేది. ఆయన అడిగింది కాదనకుండా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదని గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Errabelli: తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ప్రస్థానం మొదలైంది. వర్ధన్నపేట నియోజకవర్గం నుండి 1994, 99, 2004 సాధారణ ఎన్నికల్లో దయాకర్ రావు వరుసగా విజయం సాధించారు. 2008లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిద్యం వహిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయింది. దయాకర్ రావు విజయాలకు అడ్డుకట్ట వేసేందుకు వరంగల్ కాంగ్రెస్ నాయకులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మీద వత్తిడి తెచ్చి ఎస్సీకి రిజర్వ్ అయ్యేలా చేశారనే చర్చ కూడా జరిగింది. దీంతో పక్కనే ఉన్న పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎర్రబెల్లి పోటీ చేసారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఎర్రబెల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 నుండి 2023 వరకు కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఎర్రబెల్లి ఓడిపోయారు. అప్పటి నుండి రాజకీయాల్లో ఎర్రబెల్లి హవా తగ్గుతూ వస్తుందనే చర్చ మొదలైంది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవన్నపేట శివారులో నిర్వహించాలని తొలుత అనుకున్నారు. అధినేత కేసీఆర్‌తో జరిగిన మొదటి సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్ రావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్‌ను పిలిచారు. దీంతో ఉద్యమ కాలం నుండి పార్టీలో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర నేతలు బీఆర్ఎస్ అధిష్టానంపై అలక బూనినట్టు సమాచారం.
Errabelli: సదరు నేతలను వెంటనే కేసీఆర్ ఫాం హౌస్‌కి పిలిపించుకుని మాట్లాడారు. రజతోత్సవ సభ బాధ్యతల విషయంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య ఐక్యత రాకపోవడంతో ఒక దశలో సభను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేయాలని కేసీఆర్ భావించారు. మళ్లీ వరంగల్ జిల్లా నేతల అభ్యర్థనతో హన్మకొండ జిల్లా ఎక్కతుర్తిలో సభ నిర్వహించేందుకు కేసీఆర్ అంగీకరించినట్టు తెలిసింది. దేవన్నపేట వద్ద సభ జరిగితే దాని భాద్యతలు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతికి వెళ్లేవని, సభను దేవన్నపేట నుండి ఎల్కతుర్తికి మారేలా చేసి ఎర్రబెల్లి నుండి బాధ్యతలను ప్లాన్ ప్రకారం తప్పించేలా చేశారనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతుంది.
ఎర్రబెల్లి దయాకర్ రావును రజతోత్సవ సభ బాధ్యతల నుండి తప్పించడమే కాకుండా ఆయన ఆశిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గాన్ని కూడా దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గ భాద్యతలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్‌ను అడుగుతున్నట్టు చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఆయనకు ఎలాగైనా వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ భాద్యతలు దక్కేలా చేసేందుకు ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజకీయ జన్మనిచ్చిన వర్ధన్నపేట నియోజకవర్గం కూడా దూరం అయినట్టే అని చర్చించుకుంటున్నారు.
Errabelli: రజతోత్సవ సభ నిర్వహణ బాధ్యతలను తానే వద్దనుకున్నానని ఎర్రబెల్లి తన సన్నిహితుల వద్ద అంటున్నట్టు సమాచారం. సభ నిర్వహణ విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ప్రతి దానికి తననే భాద్యున్ని చేసే చాన్స్ ఉందని, ఎవరికి ఏ లోటు జరిగిన తననే అడుగుతారని, ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి అన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయని అందుకే తన పని తాను చేసుకుపోతున్నానని ఎర్రబెల్లి అంటున్నట్టు సమాచారం. సభకు పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేసి దటీజ్ దయాకర్ రావు అనిపించుకుంటానని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తుంది.