DSP Jayasuriya issue

DSP Jayasuriya issue: జనసేన పుట్టలో వేలు పెడుతున్న రఘురామ!

DSP Jayasuriya issue: పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట క్లబ్‌ల సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భీమవరంలో ఈ పేకాట క్లబ్‌లకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ జయసూర్యపై చర్యలు తీసుకోవాలని పవన్‌ జిల్లా ఎస్పీకి, హోంమంత్రి వంగలపూడి అనితకు, డీజీపీకి సమాచారం అందించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సివిల్ కేసుల్లో జయసూర్య జోక్యం, కూటమి నాయకుల పేర్లు వాడుకుంటూ, అక్రమ కార్యకలాపాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు పవన్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. పోలీస్ శాఖ జయసూర్యను బదిలీ చేయాలని నిర్ణయించినా, పశ్చిమగోదావరి జిల్లాకే చెందిన ఒక కూటమి ఎమ్మెల్యే అడ్డుకున్నారట. ప్రభుత్వ నిర్ణయానికే బ్రేకులు వేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు? పవన్ కోపం డీఎస్పీపైనా, ఆయన వెనుకున్న ఎమ్మెల్యేపైనా, లేక రాష్ట్రవ్యాప్తంగా పేకాట రాకెట్‌లపైనా? ఇది ఇప్పుడు కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోలోని ఏడు నియోజకవర్గాలు చూస్తే… భీమవరంలో రామాంజనేయులు, తాడేపల్లిలో బొలిశెట్టి శ్రీనివాసరావు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్‌.. ముగ్గురూ జనసేన ఎమ్మెల్యేలు. వీరు పవన్‌కళ్యాణ్‌ మాటని జవదాటరు. ఇక మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో.. పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు ఇటువంటి వివాదాలకు దూరం. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉండి ఎమ్మెల్యే రఘురామ.. ఈ ముగ్గురూ కూడా పవన్‌కు విధేయులుగానే ఉంటారు. మరి జిల్లాలో డీఎస్పీని కాస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలు వైసీపీ హయాంలో గన్నవరం డీఎస్పీగా ఉండి, వైసీపీకి విధేయత చూపిన జయసూర్యను.. కూటమి ప్రభుత్వం వచ్చాక భీమవరంకు తీసుకురావడం వెనుక ఎవరి మంత్రాంగం నడిచింది? అన్న చర్చ జరుగుతన్న సమయంలో.. ఆలస్యం చేయకుండా రఘురామ రంగ ప్రవేశం చేశారు.

Also Read: Ponglueti: ఇందిరమ్మ ఇల్లు.. ఇకనుంచి రెండు ఫ్లోర్లు కట్టుకోవచ్చు..

డీఎస్పీ జయసూర్య వివాదంపై మీడియాతో మాట్లాడిన రఘురామ…. జయసూర్య మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. పేకాట నేరం కాదని చెప్పుకొచ్చారు. భీమవరంలో కానీ, జిల్లాలో కానీ ఎక్కడా పేకాట స్థావరాలు లేవని చెప్పారు. ఇప్పుడు జనసేన వర్గాలకు షాకింగ్‌గా మారాయి రఘురామ వ్యాఖ్యలు. ఎందుకంటే, డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై పవన్ అంత సీరియస్‌గా స్పందించడానికి మూలం భీమవరం జనసేన ఎమ్మెల్యే రామాంజనేయుల ఫిర్యాదే అని తెలుస్తోంది. రఘురామ సొంత నియోజకవర్గం ఉండి, భీమవరం పక్కనే ఉంటుంది. రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన పవర్‌ చెలాయిస్తున్నారన్న టాక్‌ ఉంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ విషయంలోనూ రఘురామ… భీమవరం జనసేన ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. పదే పదే భీమవరంలో జోక్యం చేసుకోవడం, డీఎస్పీని వెనకేసుకు రావడం, ఇలా రఘురామ రాజకీయ పెత్తనంపై విసుగు చెందిన ఎమ్మెల్యే రామాంజనేయులు సమస్యని పవన్‌కి చేరవేసినట్లు సమాచారం. పవన్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం, రఘురామ డీఎస్పీకే తన మద్దతు అని ప్రకటించడం.. ఇప్పుడు డీఎస్పీ బదిలీ విషయంలో ఎవరి మాటకి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ అంశంలో చివరికి హోంమంత్రి అనితకు చిక్కొచ్చి పడింది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్దమేమీ కాదని, అలాంటిది హోం శాఖకు నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా, అనిత ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలో జగన్‌కు ఇలా ప్రశ్నలు వేశారా? అంటూ మండిపడుతూనే.. మంత్రులమంతా ఎన్‌డీఏ కూటమిగా సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని, తమ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయొద్దని విలేకరులకు చురకలు అంటించారు. ఇక ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా ఉన్నారని టాక్‌. హోంమంత్రి, డీజీపీలను పిలిచి సమగ్ర విచారణకు ఆదేశించారట సీఎం చంద్రబాబు. జయసూర్యపై నివేదిక హోం శాఖ వద్ద ఉందని అనిత చెప్పినా, నిర్దిష్ట ఆరోపణలు బయటపడలేదు. ఏది ఏమైనా పవన్‌ స్పందించారు కాబట్టి బదిలీ ఖాయమని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి, డిప్యూటీ సీఎం vs డిప్యూటీ స్పీకర్‌ మారిన ఇష్యూలో… హోం మినిస్టర్‌ సతమతమవుతున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం బంతి బాబు గారి కోర్టులో ఉన్నందున… ఈ వివాదానికి సీఎం చంద్రబాబు ఏ విధంగా చెక్‌ పెడతారో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *