CM VS TDP MLAS: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో అధికార టీడీపీకి చెందిన ఓ ఆరేడుగురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత వ్యవహారాలు, అక్రమ సంపాదన ఆరోపణలు, అధికార దుర్వినియోగం, మహిళల పట్ల అనుచిత వైఖరి వంటి విషయాలతో వార్తల్లో నిలిచారు. ఈ పరిణామాలు టీడీపీ ఇమేజ్‌పై ప్రభావం చూపుతున్నాయని, చంద్రబాబు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొందరు ఎమ్మెల్యేలు బేఖాతరు చేస్తున్నారని సమాచారం. ఉదాహరణకు.. ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్, అనంతపురం ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు, అలాగే ఒక ఎమ్మెల్యే దళిత మహిళా ప్రిన్సిపల్‌ను వేధించినట్లు ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అదే విధంగా నియోజకవర్గాల్లో గుడ్ విల్ ఉన్న ఓ ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఓ రౌడీ షీటర్ పెరోల్ విషయంలో తలదూర్చి ఒక్కసారిగా బ్యాడ్ అయ్యారు. ఇలా కొందరు ఎమ్మెల్యేల వల్ల తలెత్తుతున్న వివాదాలు పార్టీ అధిష్ఠానానికి పెద్ద సవాలుగా మారాయి.
ఇప్పటికే కొన్ని నియోజకర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతిపై చర్చ నడుస్తోంది. లిక్కర్.. శాండ్.. మైన్స్ వంటి వ్యవహారాల్లో వైసీపీ పాలనకు, ఇప్పటి కూటమి ప్రభుత్వానికి ఏ మార్పు లేదని ఆ నియోజకవర్గాల్లో ప్రజలు పెదవి విరుస్తున్న పరిస్థితి. అటువంటి ఎమ్మెల్యేలను అదుపు చేసేందుకు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని, ఎమ్మెల్యేలను పిలిపించుకుని వన్ టు వన్ సమావేశాలు జరుపుతూ హెచ్చరిస్తున్నారు. ఇది ఒకవైపు నడుస్తుండగానే.. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత వ్యవహారాల్లో రచ్చకెక్కుతూ ఉండటం ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యవహారాల్లోనే చిక్కి, ఆ బురద కడుక్కోలేక ఆఖరికి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వారు వ్యక్తిగతంగా ఓటమి పాలవడమే కాకుండా వైసీపీ మీద ఒక విధమైన ముద్ర పడిపోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు కొందరు కూటమి ఎమ్మెల్యేలు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వివాదాలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Suravaram Sudhakar Reddy: సురవరం పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి దానం..!
కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా, వ్యాపారాలు, వ్యక్తిగత వ్యవహారాల్లో మునిగిపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఇది పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని, ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని పలువురు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో, వైసీపీ ఈ వివాదాలను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని, టీడీపీ ఎమ్మెల్యేలను ఉచ్చులోకి లాగే వ్యూహాలు రచిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఈ సమస్యను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణను అమలు చేయడానికి అంతర్గత సంస్కరణలు అవసరమని, కేవలం హెచ్చరికలతో సమస్య పరిష్కారం కాదని వారు అంటున్నారు.
వివాదాల్లో తలదూర్చే నేతలు, అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తును సమీక్షించుకోవాలని చంద్రబాబు ఘాటుగానే హెచ్చరిస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలైనా సరే.. లైన్ క్రాస్ చేసి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కేసులు, అరెస్టులు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని తాజా క్యాబినెట్ మీట్‌లో డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారంట సీఎం చంద్రబాబు. మొత్తంగా, టీడీపీ ఎమ్మెల్యేల వివాదాలు పార్టీకి ఒక సవాలుగా మారినప్పటికీ, చంద్రబాబు దీర్ఘకాల రాజకీయ అనుభవం, వ్యూహాత్మక నాయకత్వం ఈ సమస్యను పరిష్కరించగలదని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో, చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ఈ వివాదాలను అధిగమించి, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం కీలకం.