BJP Vishnu Tidco: అమరావతిపై వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అమరావతి రాజధాని నిర్మాణంపై ఖర్చులు పెరుగుతున్నాయని, అదే సమయంలో పేదల ఇళ్ల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి తమ కంపెనీ కష్టపడి పనిచేసిందని, కానీ ఇప్పటికీ ప్రభుత్వం 100 కోట్లకు పైగా బకాయిలను చెల్లించలేదని వాపోయారు. పేదోటి సొంతిటి కల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని వేడుకుంటూనే, అమరావతిపై లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం న్యాయమా? అంటూ ప్రభుత్వానికి చురకలంటించారు. అదే సమయంలో… పేదల టిడ్కో ఇళ్లు కట్టిన వారికి బిల్లులు రావడం లేదు కానీ… రుషి కొండపై జగన్ కోసం ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టర్లకు మాత్రం ఈ ప్రభుత్వంలో నిధులు విడుదల అవుతున్నాయంటూ… అటు జగన్నీ, ఇటు కూటమి ప్రభుత్వాన్ని ఏక కాలంలో ఇరుకున పెట్టారు విష్ణుకుమార్ రాజు.
Also Read: Bonda Big Mistake: పులి పరధ్యానంగా ఉందని పరాచకాలు ఆడకూడదు సు(ఉ)మా!
అయితే, విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను వైసీపీ మరో కోణంలో ప్రొజెక్ట్ చేస్తోంది. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది వైసీపీ. ప్రస్తుతం టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలహీన స్థితిలో ఉందనీ, దీంతో బిజెపి నేతలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టిడిపితో క్రమంగా దూరం పాటిస్తున్నారని సోషల్‌మీడియాలో కథలు వండి వారుస్తోంది. ఇంతకీ రాజుగారి ఆవేదన.. పేదల ఇళ్లపై ప్రేమతోనా? లేక తన సొంత కంపెనీకి బకాయిలు చెల్లించట్లేదన్న అసంతృప్తితోనా అంటూ కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. మనలో మన మాట… రాజు గారి సొంత కంపెనీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించినట్టయితే, ఆయన ఈ అంశాన్ని లేవదీసేవారా అంటూ అసెంబ్లీలో ఆవరణలోనే పలువరు నేతలు గుసగుసలాడుకున్నారట.
ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు నిజంగానే పేదల సమస్యల పట్ల దయతో మాట్లాడుతున్నారా? లేక ఆ బకాయిలే ఈ ఆగ్రహానికి మూలమా? పేదల ఇళ్లపై ఒక్కసారిగా మమకారం పెరగడం, అదే సమయంలో అమరావతిపై విమర్శలు కురిపించడం… ఈ వైఖరి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించకుండా ఉండగలదా? అన్నది ఇప్పుడు ఏపీ కూటమి వర్గాల్లో హాట్ డిస్కషన్‌గా మారిపోయింది.