Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పొత్తు ప్రతిపాదనపై తమ బీహార్ నాయకత్వం ఇప్పటికే ఆర్జేడీని సంప్రదించిందని, ఇప్పుడు నిర్ణయం పూర్తిగా ఆర్జేడీ చేతుల్లోనే ఉందన్నారు. బీజేపీ, జేడీయూ కూటమిని ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్‌డీటీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు, బీహార్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే లౌకికవాదాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రతిపాదన చేశారు. గతంలో మైఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఆర్జేడీ పార్టీలోకి చేరినప్పటికీ, పొత్తుకు ముందుకు వచ్చినట్లు ఆయన వివరించారు. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు లేఖ రాశారని, పొత్తులో భాగంగా ఆరు సీట్లు కేటాయించాలని, గెలిస్తే మంత్రి పదవులు కాకుండా సీమాంచల్ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని మాత్రమే డిమాండ్ చేసినట్లు ఒవైసీ వెల్లడించారు. అలాగే, తమ కంచుకోట అయిన హైదరాబాద్‌లో పోటీ చేసేందుకు ఆర్జేడీని ఆహ్వానిస్తున్నట్లు కూడా తెలిపారు.
అదే సమయంలో దేశంలోని పలు సమకాలీన అంశాలపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా వేడుకల్లో ముస్లింల ప్రవేశాన్ని నిరాకరించడం సామాజిక బహిష్కరణగా దృష్టించవచ్చని ఆయన విమర్శించారు. అలాగే, కాన్పూర్‌లో ‘ఐ లవ్ మహమ్మద్’ పోస్టర్లపై సృష్టించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ప్రేమను వ్యక్తం చేయడంలో తప్పేమి లేదని, కానీ ఇలాంటి చర్యల ద్వారా ముస్లింలను సామాజికంగా బహిష్కరించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు.