Asaduddin owaisi: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, ఈ దిశగా ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమితో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఎంఐఎం పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అఖ్తరుల్ ఇమామ్ నేతృత్వంలో ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్డీఎఏ కూటమికి చెక్ పెట్టేందుకు మహాకూటమితో కలిసి పనిచేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. ప్రత్యేకంగా సీమాంచల్ ప్రాంతంపై దృష్టిసారిస్తున్నట్టు పేర్కొన్నారు. “ఈ ప్రాంతంలో మేము మజ్బూతంగా ఉన్నాం. అక్కడి కార్యకర్తల బలం మాకుంది,” అని అన్నారు.
గతంలో కూడా ఎన్డీఏను ఎదుర్కోవడానికి తమ పార్టీ తీవ్రంగా ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, మహాకూటమి పార్టీలతో పొత్తు కుదరనిచో, మజ్లిస్ పార్టీ బీహార్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఒవైసీ తేల్చిచెప్పారు.
ఓటర్ల జాబితా సవరణపై అభ్యంతర
ఇదే సమయంలో బీహార్‌లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఈ నిబంధనల వల్ల వేలాది మంది నిరుపేదలు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది,” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సీమాంచల్ వంటి ప్రాంతాల్లో వరదలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక కుటుంబాలు వలస వెళ్తున్నాయని తెలిపారు. అలాంటి ప్రజలు ఓటర్లుగా నమోదుకావడానికి బర్త్ సర్టిఫికెట్, నివాస ధ్రువపత్రాలు, తల్లిదండ్రుల పత్రాలు వంటి కఠినమైన ప్రమాణాలు చూపాల్సిన అవసరం తలెత్తుతున్నదని పేర్కొన్నారు. ఈ విధానం పేదల ఓటు హక్కును హరిస్తుందని తీవ్రంగా విమర్శించారు.