Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఐక్యంగా ముందుకొస్తే, పరిశ్రమకు న్యాయం జరిగేలా అనుకూల నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సినీ రంగంపై ఎలాంటి కక్ష సాధింపు లేదని, అనుమతులు, టికెట్ రేట్ల విషయంలో వేగవంతమైన స్పందనతో మద్దతు అందిస్తున్నామని తెలిపారు. కొత్త ఫిల్మ్ పాలసీ రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేతపై హోం శాఖ విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. “హరిహరవీరమల్లు” చిత్రం విడుదల సందర్భంగా ఏర్పడిన సమస్యలపై కూడా స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలోని కళాకారుల హక్కులు, ప్రజల అభిరుచిని గౌరవిస్తామని, అస్థిరత కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వం సినీ వర్గాలను వేధించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిశ్రమను ప్రోత్సహిస్తోందని మంత్రి వివరించారు.
