Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇవాళ్టి నుంచి మరో లెక్క అన్నట్లుగా భానుడు తన విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు. రానున్న ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత ఊహించని రేంజ్లో ఉండబోతోందని వాతావరణ శాఖ అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, కాసేపు బయటకు వెళ్తేనే కళ్లు బైర్లు కమ్మేంత వేడి పుడుతోంది. ఇంట్లో ఉందామన్నా ఫ్యాన్లు, కూలర్లు తిరుగుతున్నా ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే “ముందుంది ముసళ్ల పండుగ” అన్నట్లుగా.. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు మాడు పగిలిపోయేలా వడగాల్పులు వీస్తాయని అధికారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు.
ఈ తీవ్రమైన ఎండల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం రానున్న ఐదు రోజులు అగ్నిగోళంలా మారనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు అధికారులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, వరంగల్, మహబూబాబాద్, నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో కూడా ఎండలు, ఉక్కపోత తీవ్రంగానే ఉంటాయని స్పష్టం చేశారు.
ఇటు ఆంధ్రప్రదేశ్‌ను కూడా ఉతికేయడానికి సూర్యుడు రెడీ అయ్యాడు. ఏపీలో ఈ నెల 26వ తేదీ వరకు అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రానున్న వారం రోజుల పాటు కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఉక్కపోత భారీగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రోజుల పాటు వడగాల్పుల తీవ్రత గరిష్ట స్థాయికి చేరనుంది. కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకిన తర్వాతే ఈ ఎండల వేడి కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. ఎక్కువ మొత్తంలో నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
