Mamata Banerjee

Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ పతనం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలోనే ఢిల్లీ పీఠం నుంచి బీజేపీ తప్పుకోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. తన నివాసంలో టీఎంసీ ఎమ్మెల్యేలతో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్‌లో కొత్తగా ఏర్పాటైన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత హింస పెరిగిపోయిందని, ముఖ్యంగా మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేదల దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మన దేశ రాజ్యాంగ విలువలను పూర్తిగా పక్కనబెట్టేసిందని విమర్శిస్తూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి త్వరలోనే పడిపోతుందని స్పష్టం చేశారు.

నా ఇల్లు కూల్చేస్తారా? చేసుకోండి”.. సవాల్ విసిరిన అభిషేక్ బెనర్జీ!
ఈ సమావేశంలో పాల్గొన్న మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ సైతం బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. కోల్‌కతాలోని ఆయన నివాసంలో అనుమతి లేకుండా నిర్మించిన భాగాలను కూల్చివేయాలంటూ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) నోటీసులు జారీ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఈ నోటీసులు ఇచ్చిన కేఎంసీ సంస్థ ఇప్పటికీ టీఎంసీ చేతిలోనే ఉంది. మమతకు అత్యంత ఆప్తుడైన ఫిర్హాద్ హకీమ్ ప్రస్తుతం కోల్‌కతా మేయర్‌గా ఉన్నారు. అయినప్పటికీ, ఈ నోటీసులపై అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. తాను ఇలాంటి బెదిరింపులకు అస్సలు భయపడనన్నారు. “వాళ్లు ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి.. నా ఇల్లు కూల్చేస్తారా? నోటీసులు పంపుతారా? చేసుకోండి. నేను తలవంచే ప్రసక్తే లేదు, బీజేపీపై నా పోరాటం ఆపను” అని తెగేసి చెప్పారు.

కెమెరా ముందు డబ్బులు తీసుకున్న వ్యక్తి సీఎం ఆ?
ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారిపై అభిషేక్ బెనర్జీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సువేందు అధికారి గతంలో టీఎంసీలో ఉన్నప్పుడు జరిగిన ‘నారద స్టింగ్ ఆపరేషన్’ వివాదాన్ని ఆయన గుర్తు చేశారు. “మన రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు.. కానీ ఇలాంటి వ్యక్తిని ఎవరూ చూసి ఉండరు. కెమెరా ముందు నిలువునా డబ్బులు తీసుకుంటూ దొరికిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు” అంటూ ఘాటుగా విమర్శించారు.

మే 21 నుంచి టీఎంసీ భారీ ఆందోళనలు!
రాష్ట్రంలో జరుగుతున్న పేద వ్యాపారుల బలవంతపు తరలింపులను, బీజేపీ తీసుకొచ్చిన ఈ “బుల్డోజర్ సంస్కృతిని” నిరసిస్తూ మే 21 నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని టీఎంసీ నిర్ణయించింది. కోల్‌కతా పరిసర ప్రాంతాలైన బల్లిగంజ్, హౌరా జంక్షన్, సీల్దా రైల్వే స్టేషన్ అనే మూడు ప్రధాన ప్రాంతాల్లో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు టీఎంసీ శ్రేణులు భారీగా సిద్ధమవుతున్నాయి. దీనితో బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *