New Ration Cards: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల రంగంలో మరో కీలక అడుగు వేసింది. టెక్నాలజీ సాయంతో అవినీతి నియంత్రణ, పారదర్శక పాలన, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది.
మొదటి విడత పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా నుండి ఈ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించగా, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలోని 1.46 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నారు.
మొదటి విడతగా ఈ నెల 31 వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేయనున్నారు. మొత్తం తొలివిడతలో 9 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది.
నాలుగు విడతల్లో పంపిణీ
-
రెండో విడత: ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఏలూరు, కాకినాడ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో.
-
మూడో విడత: సెప్టెంబర్ 6 నుంచి 18 వరకు అనంతవరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీవురం మన్యం, కోనసీమ జిల్లాల్లో.
-
నాలుగో విడత: సెప్టెంబర్ 19 నుంచి వైఎస్సార్ కడప, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో.
ఇది కూడా చదవండి: Fire Accident: కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం
స్మార్ట్ కార్డుల ప్రత్యేకతలు
-
ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ కార్డులు బలంగా, మన్నికగా ఉంటాయి.
-
నేతల ఫొటోలు లేకుండా, కుటుంబానికి చెందిన ప్రధాన లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉంటుంది.
-
క్యూఆర్ కోడ్తో ముద్రించబడి, స్కాన్ చేసిన వెంటనే లబ్ధిదారుల వివరాలు, అందించాల్సిన సరుకుల జాబితా డిపో డీలర్‌కు కనిపిస్తుంది.
-
లావాదేవీలన్నీ రియల్ టైమ్ డేటా రూపంలో ప్రభుత్వానికి చేరతాయి.
-
డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, లబ్ధిదారులు రేషన్ సమస్యలపై 1967 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయగలరు.
పంపిణీ విధానం
జిల్లా రేషన్ డిపోలు, గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు. ప్రతికార్డు ఇచ్చే ముందు ఈ-పోస్ పద్ధతిలో ధృవీకరణ తప్పనిసరి. వృద్ధులు, దివ్యాంగులకు కార్డులు వారి ఇళ్లకే వెళ్లి అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పాత కార్డుల స్థానం ఏమిటి?
కొత్త కార్డులు జారీ అయిన తర్వాత పాత రేషన్ కార్డులు చెల్లవు. ఇకపై ప్రభుత్వ పథకాలన్నింటికీ కొత్త స్మార్ట్ కార్డు తప్పనిసరి ఆధారంగా పనిచేస్తుంది. అయితే కొత్త కార్డు వచ్చే వరకు పాత కార్డుతో సరుకులు పొందే అవకాశం ఉంటుంది.