Cloudburst: ఉత్తరాఖండ్ రాష్ట్రం భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటాలతో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో సంభవించిన మేఘ విస్ఫోటం ఈ విపత్తుకు ప్రధాన కారణం. మోపాటా, బాసుకేదర్ తహసీల్ వంటి ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయి అనేక కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ వరద బీభత్సంలో ఇప్పటివరకు చాలామంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతయ్యారు. మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు కొట్టుకుపోగా, పశువుల కొట్టాలు కూలిపోవడంతో 20కి పైగా పశువులు చనిపోయాయి.
నిరంతర వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. కేదార్‌నాథ్ లోయలోని లారా గ్రామాన్ని కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మేఘ విస్ఫోటనం కారణంగా అలకనంద, మందాకిని నదులలో నీటి మట్టాలు ప్రమాదకరంగా పెరిగాయి. రుద్రప్రయాగ్‌లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: JD Vance: జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ విపత్తుపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని సూచించారు. ఈ వరదల్లో మనుషులతో పాటు అడవుల్లోని, గ్రామాలలోని జంతువులు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇటీవల రాంనగర్‌లోని ఒక కాలువలో చిరుతపులి వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇది ఈ విపత్తు తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ వంటి జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ సెలవులను పొడిగించే అవకాశాలు ఉన్నాయి. మణిమహేష్ యాత్రకు వెళ్లిన 8 వేల మంది యాత్రికులు కూడా వరదల్లో చిక్కుకున్నారని సమాచారం అందడంతో వారిని రక్షించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం సహాయక, రక్షణ పనులు కొనసాగుతున్నాయి.