Ram Gopal Varma: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)కు మరో చిక్కు వచ్చి పడింది. ఆయనపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్జీవీతో పాటు ఆయనను ఇంటర్వ్యూ చేసిన ఒక టీవీ ఛానెల్ యాంకర్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే..
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆర్జీవీ హిందూ ఇతిహాసాలు, దేవుళ్లు, ఇండియన్ ఆర్మీ మరియు ఆంధ్రులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందింది.
రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది మేడా శ్రీనివాస్ ఈ ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ కోసం ఆ మహిళా యాంకర్ కావాలనే వివాదాస్పద ప్రశ్నలు అడిగారని మేడా శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే ఆర్జీవీ వీడియోల వెనుక విదేశీ టెర్రరిస్టుల హస్తం కూడా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆర్జీవీ, యాంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడా శ్రీనివాస్ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు
ఈ ఫిర్యాదు మేరకు రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు ఆర్జీవీతో పాటు ఆ యాంకర్‌పై క్రైమ్ నెం 487/2025, U/s 196 (1), 197(1) 353, 354,299 R/w (3) Bns Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఆర్జీవీ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వివిధ వివాదాస్పద అంశాలపై కేసులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ కొత్త కేసు ఆర్జీవీకి మరో సమస్యగా మారింది.