Hyderabad: హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్‌ను చోరీ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఓ దవాఖాన వద్ద ఆపి ఉన్న అంబులెన్స్‌ను చోరీ చేసి పరారయ్యాడు దొంగ. ఈ ఘటనపై పోలీసుల అప్రమత్తతతో అతడిని పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్ సైరన్ మోగిస్తూ విజయవాడ వైపు పరారయిన అతడిని చిట్యాల వద్ద పోలీసు అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ దొంగ అక్కడున్న వారిని ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద గేటును ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయాడు. అయితే, చివరికి సూర్యాపేట మండలంలో టేకుమట్ల వద్ద పోలీసులు రోడ్డుపై లారీలు అడ్డగట్టి దొంగను పట్టుకున్నారు. ఈ నిందితుడు గతంలో పలు చోరీ కేసుల్లో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.