Ambati Rayudu: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు సుకుమార్ హాజరయ్యారని తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చిరంజీవి మరియు సుకుమార్ వంటి ప్రముఖులు టీవీ ప్రచారం కోసం మ్యాచ్‌కు వచ్చారని అంబటి రాయుడు వ్యాఖ్యానించడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో కాలంగా క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న మ్యాచ్ నిన్న ఆదివారం రోజు ముగిసింది. చిరకాల ప్రత్యర్థులైన ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది వేయి కళ్లతో ఎదురు చూశారు. టీమ్ ఇండియా అభిమానులు ఇండియా గెలవాలని కోరుకున్నారు. వారు అనుకున్నట్లే, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించింది.
సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా ఈవెంట్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయనే విషయం కొన్ని కోట్ల మందిని టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. చాలా మంది స్టేడియానికి వెళ్లి లైవ్‌లో ఆ మ్యాచ్‌ను ఆస్వాదించాలనుకున్నారు.
సాధారణ ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆసక్తి చూపిస్తారు. అలాగే ఆదివారం జరిగిన మ్యాచ్‌కు కూడా చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. స్టేడియంలో వారిని చూసి చాలా మంది తెలుగు అభిమానులు ఆశ్చర్యపోయారు.
Also Read: Hardik Pandya Girlfriend: పాక్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ హడావుడి..!
అయితే, సెలబ్రిటీలు క్రికెట్ మ్యాచ్‌కు రావడంతో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. “ఇలాంటి మ్యాచ్‌లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్” అని చాలా చీప్ కామెంట్స్ చేశాడు. ఇది సుకుమార్ మరియు చిరంజీవి గురించి తెలుగు కామెంటర్లు మాట్లాడుతున్న సమయంలో రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మన దేశం తరఫున ఒక జట్టు ఆడుతున్నప్పుడు, ఆటపై ఇష్టంతో మద్దతు చేయడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని స్టేడియానికి వచ్చిన వారిని ఈ విధంగా అవమానిస్తావా అని నెటిజన్లు రాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ గొప్పదే కాదని ఎవరూ అనరు, కానీ చిరంజీవి మరియు సుకుమార్ టీవీల్లో కొత్తగా కనిపిస్తున్నారా? వారి గురించి ఎవరికీ తెలియదా? పాన్ ఇండియా డైరెక్టర్‌గా సుకుమార్ గురించి దేశమంతా తెలుసు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంక్రాంతి సంబురాల్లో పాల్గొనే రేంజ్ ఆయనది. భారత దేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి. అలాంటి వారు ఎంతో ఇష్టంతో, ఆటపై తమకున్న ప్యాషన్‌తో మ్యాచ్ చూసేందుకు వస్తే, టీవీల్లో కనిపించేందుకు వచ్చారని అంటావా? ఎందుకింత అహంకారం అని రాయుడిని తిట్టిపోస్తున్నారు. వారు పబ్లిసిటీ కోసం రావడం కాదు, నువ్వే అటెన్షన్ కోసం ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తున్నట్లు ఉన్నావని మండిపడుతున్నారు.