ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2024 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి.టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో ఇప్పటి వరకు 94.30 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 4,27,300 మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4,02,935 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్ష తేదీ సమీపిస్తున్న తరుణంలో మిగిలిన వారు కూడా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మొత్తం 19 రోజులపాటు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న టెట్ పరీక్షలు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి. అక్టోబరు 11, 12 తేదీలు మినహా 3 నుంచి 21 వరకు వరుసగా టెట్ నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.