Air India: ప్యారిస్ నుండి ఢిల్లీకి వస్తున్న అంతర్జాతీయ విమానాన్ని పైలట్ జైపూర్‌లో వదిలివేశాడు. దీంతో 180 మందికి పైగా ప్రయాణికులు 9 గంటల పాటు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. తమ డ్యూటీ అవర్స్ పూర్తయ్యాయని పైలట్లు విమానాన్ని విడిచిపెట్టినట్టు చెప్పారు. వాస్తవానికి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా జైపూర్‌కు మళ్లించారు. దీంతో రూల్స్ ప్రకారం పైలెట్స్ విమానాన్ని నడపడానికి ఉన్న సమయం అయిపోయింది. పైలెట్ లేని కారణంగా ప్రయాణికులను రోడ్డు మార్గంలో ఢిల్లీకి పంపించారు.
Air India: పైలెట్లకు విమానాన్ని నడపడానికి పరిమితమైన సమయాలు ఉంటాయి. ఆ టైం ఫ్రేమ్ లో మాత్రమే వారు పనిచేయాలి. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటే ICAO, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే DGCA పైలట్ల పని గంటలను నిర్ణయించాయి. వీటి ప్రకారం పైలట్లు 24 గంటల్లో గరిష్టంగా 8 గంటలు, వారంలో గరిష్టంగా 30 గంటలు విమానాన్ని నడపాలి. డ్యూటీ టైమ్ పూర్తయిన తర్వాత కూడా, ప్రత్యేక పరిస్థితుల్లో, పైలట్‌కు మరో 4 గంటల పాటు విమానాన్ని నడిపేందుకు అనుమతి ఇవ్వవచ్చు. ఒక పైలట్ విమానం నడపడానికి ముందు కనీసం 10 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
అసలేం జరిగింది . .
Air India: ప్యారిస్ నుండి ఢిల్లీకి వస్తున్న ప్రయాణీకులు చెప్పిన వివరాల ప్రకారం ఎయిరిండియా విమానం AI-2022 ఆదివారం రాత్రి 10 గంటలకు పారిస్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. సోమవారం ఉదయం 10:35 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఢిల్లీలో ల్యాండ్ కాలేదు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సూచనల మేరకు పైలట్ జైపూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12:10 గంటలకు విమానాన్ని దించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ నుండి క్లియరెన్స్ కోసం పైలట్లు వేచి ఉన్నారు.
Air India: మధ్యాహ్నం వరకు కూడా క్లియరెన్స్ రాలేదు. డ్యూటీ టైం పూర్తయిందని చెప్పి పైలట్ విమానం వదిలి వెళ్లిపోయాడు. ఈ కారణంగా, విమానంలో ఉన్న 180 మందికి పైగా ప్రయాణికులు జైపూర్ విమానాశ్రయంలో రాత్రి 9 గంటల వరకు ఇబ్బంది పడ్డారు.
ఆలస్యమవడంతో ప్రయాణికులు తోపులాటకు దిగారు . మరో విమానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విమానయాన సంస్థ వారి డిమాండ్‌ను అంగీకరించలేదు. బదులుగా వారిని బస్సులో ఢిల్లీకి పంపే అవకాశాన్ని ఇచ్చింది. వారికి ఆహారం అందించారు. అనంతరం కొందరు ప్రయాణికులు ఎయిర్‌లైన్ బస్సులో, మరికొందరు ప్రైవేట్ వాహనాల్లో ఢిల్లీకి బయలుదేరారు.

