Adilabad: ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న రాజస్థాన్‌కు చెందిన సాహిల్ చౌదరి (19) అనే విద్యార్థి బుధవారం ఉదయం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రిమ్స్ క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేపింది.
బుధవారం ఉదయం సాహిల్ తన హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. తోటి విద్యార్థులు వచ్చి పిలిచినా ఎంతకీ తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు, హాస్టల్ నిర్వాహకులు కలిసి తలుపులు బద్దలు కొట్టి చూడగా, సాహిల్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే సాహిల్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాహిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సాహిల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సాహిల్ సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
Also Read: Feroz Khan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫిరోజ్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సాహిల్ చౌదరి, ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరీక్షల ఒత్తిడి ఆత్మహత్యకు ఒక కారణం కావచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు అధ్యాపకులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనతో రిమ్స్ మెడికల్ కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఒత్తిడిని ఎదుర్కోవడానికి వారికి తగిన మద్దతు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.