Visakhapatnam: ఐఫోన్ అంటే చాలామందికి ఒక కల. కానీ, ఆ ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం విశాఖపట్నంలో విషాదం నింపింది. ఈ ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాతానగర్‌లో జరిగింది.
ఘటన వివరాలు
మృతుడు సాయి మారుతి అలియాస్ కెవిన్ కొంతకాలం హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమలో పని చేసి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. అతడి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి సాయి మారుతి తన తండ్రిని కొత్త ఐఫోన్ కొనివ్వాలని పట్టుబట్టాడు. ఈ విషయంపై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సాయి మారుతి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
తలుపులు బద్దలు కొట్టగా..
సాయంత్రం అయినా కొడుకు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే సాయి మారుతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే అతడిని కిందకి దించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయం కోసం ప్రాణాలు తీసుకున్న ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.